Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను అమలులోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 2, 2025 అర్ధరాత్రి నుంచి ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తాయని తెలిపారు. వైట్ హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆ రోజును ట్రంప్ లిబరేషన్ డేగా నిర్వచించారు. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటుగా స్టీల్, ఆటో మొబైల్ కార్మికులను ఆహ్వానించారు. అమెరికా దేశ భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని మరోసారి చెప్పారు.

మోడీ తనకు గొప్ప స్నేహితుడని
భారత్ సహా ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నాని, ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు ట్రంప్ తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా పేర్కొన్నారు. అయితే, భారత్‌పై ఇక తాము 26 శాతం మేర సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ప్రస్తావిస్తూ మోడీ తనకు గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు. అమెరికాపై 52 శాతం మేర సుంకాలు విధిస్తోందని మరోసారి గుర్తు చేశారు. మరోవైపు.. చైనాపై 34 శాతం మేర సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం సుంకాలు ఉంటాయని ప్రకటించారు.
పలు దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు
భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం వల్ల ఫార్మా, వ్యవసాయం, రసాయనాలు, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రికల్, మెషినరీ వంటి కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. వియత్నాం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 46 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు ట్రంప్. స్విట్జర్లాండ్‌పై 31 శాతం, తైవాన్ పై 32 శాతం, బ్రిటన్ పై 10 శాతం, బ్రెజిల్ పై 10 శాతం, ఇండోనేషియాపై 32 శాతం, సింగపూర్‌పై 10 శాతం, దక్షిణాఫ్రికాపై 30 శాతం మేర ప్రతీకార సుంకాలు ప్రకటించారు. అయితే ఆయన సుంకాల ప్రకటన నుంచి పలు దేశాలకు మినహాయింపు కలిగింది. అందులో రష్యా, ఉత్తర కొరియాలు, బెలారస్, క్యూబా సహా పలు దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలపై ఇప్పటికే పలు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ సుంకాలు వర్తించవని అధికార భవనం వైట్‌హౌస్ వెల్లడించింది.