Janasena : తమిళనాడు రాజధాని చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై డీఎంకే పార్టీ అధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి పలు పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా దక్షిణాదికి చెందిన పలు పార్టీలు హాజరయ్యాయి. అయితే ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. చెన్నైలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందిందని, కానీ హాజరుకాలేమంటూ సమాచారం ఇచ్చినట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

ఈ అంశంపై మా విధానం మాకు ఉంది
చెన్నైలో డి.ఎం.కె. పార్టీ నియోజకవర్గాల పునర్విజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని సమాచారం అందించాము. ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే. ఈ సమావేశంలో పాల్గొనాలని డి.ఎం.కె. తరపున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారు. వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియచేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు సమాచారం ఇచ్చాము. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయాలు వారికి ఉన్నట్లే.. ఈ అంశంపై మా విధానం మాకు ఉంది. ఈ విషయమై మా విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తాం అంటూ జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.