తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని దిల్ సుఖ్ నగర్ 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో రెండు విస్తరించిన బాంబు పేలుళ్లకు వేదికైంది. మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటాద్రి థియేటర్ వద్ద బస్ స్టాండ్, మరోవైపు కోణార్క్ థియేటర్ సమీపంలోని మిర్చి సెంటర్ వద్ద జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 18 మంది అక్కడికక్కడే మృతిచెందగా, 131 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిస్సహాయులైన పౌరులపై జరిగిన ఈ ఉగ్రదాడి తర్వాత, దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేచాయి.

న్యాయం కోసం 12 ఏళ్ల పోరాటం
ఈ దాడులకు సంబంధించిన విచారణ చాలా కాలంగా సాగుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత, తెలంగాణ హైకోర్టు ఈ కేసులో చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఉరిశిక్ష పడిన నిందితులు యాసిన్ భత్కల్ (Indian Mujahideen సహ వ్యవస్థాపకుడు), అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వఘాస్, తహసీన్ అక్తర్ అలియాస్ మోను, అజాజ్ షేక్ అలియాస్ సమర్, ఈ ఐదుగురిని NIA ప్రత్యేక కోర్టు 2016 డిసెంబరులోనే ఉరిశిక్షకు తీర్పు ఇచ్చింది. అయితే, వారు ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసుపై హైకోర్టు ఏడేళ్ల పాటు విచారణ జరిపి, అన్ని ఆధారాలను పరిశీలించి ఇప్పుడు తుది తీర్పుని వెలువరించింది.
ఎన్‌ఐఏ దర్యాప్తులో కీలకమైన విషయాలు
పేలుళ్ల తర్వాత సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, ఘటన ప్రాముఖ్యత దృష్ట్యా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడినట్లు తేలింది. నిందితులు టిఫిన్ బాక్సుల్లో బాంబులు అమర్చి భయంకర మారణహోమం సృష్టించారు. NIA దర్యాప్తులో 157 మంది సాక్షులను విచారించింది. వారి వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల మధ్య టెలికమ్యూనికేషన్ సమాచార ఆధారంగా నిందితులపై చట్టబద్ధంగా కేసు నిర్మించారు. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి రియాజ్ బక్తల్. ఇతను కర్ణాటకకు చెందినవాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇతను ఎన్నో పేలుళ్ల వెనుక ఉన్న దాడులకు మాస్టర్‌మైండ్. అతని అరెస్ట్ మాత్రం ఇప్పటివరకు సాధ్యపడలేదు. 2013లో యాసిన్ భత్కల్ మరియు అసదుల్లా అక్తర్ ను ఇండో-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేశారు. వీరి నుంచి లభించిన సమాచారం ఆధారంగా తహసీన్ అక్తర్, జియా ఉర్ రెహమాన్, అజాజ్ షేక్ లను అనుసంధానం చేసి 2014లో అరెస్ట్ చేశారు. వీరి విచారణలో జరిగిన నేర స్వీకారం, ఆధారాలు అనంతరం ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో న్యాయ విచారణకు దారి తీసింది.
మరణించిన నిందితుడు: సయ్యద్ మఖ్బూల్
ఈ పేలుళ్ల కేసులో కీలకంగా ఉన్న మరో వ్యక్తి సయ్యద్ మఖ్బూల్, గతేడాది చర్లపల్లి జైలులో అనారోగ్యంతో మరణించాడు. ఇతని స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్. ఇతను వరణాసి, ముంబై, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీ మరియు హైదరాబాద్ లో జరిగిన పేలుళ్లకు సంబంధించి కీలక పాత్ర పోషించాడు. ఈ తీర్పు అనేది దేశ భద్రతా వ్యవస్థకు, బాధితులకు న్యాయం లభించిన చిహ్నంగా భావించవచ్చు. ఉగ్రవాద కార్యకలాపాలకు తగిన శిక్ష తప్పదనే సంకేతాన్ని హైకోర్టు తీర్పు ఇస్తోంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మరణించినవారిలో 14 మంది వివరాలను అప్పుడు అధికారులు వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతూరుకు చెందిన దుర్గాప్రసాద్ (23), నల్లగొండ జిల్లాకు చెందిన రాజేందర్ రెడ్డి (21), హైదరాబాద్ బోరబండకు చెందిన మారుతి (23) పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. 1. ఎ రాములు (వారాసిగుడా, హైదరాబాద్) 2. ఎజాజ్ అహ్మద్ (ప్రేమ్‌నగర్, అంబర్‌పేట, హైదరాబాద్, పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం విద్యార్థి) 3. మహ్మద్ రఫీ (బాబానగర్, హైదరాబాదులోని చాంద్రాయణగుట్టలో బ్యాగులు కుట్టే వ్యక్తి) 4. ముత్యాల రాజశేఖర్ (ఎంబిఎ), (ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నంనూర్ గ్రామం) 5. వడ్డే విజయ్ కుమార్ (ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నంనూర్ గ్రామం) 6. హరీష్ కార్తిక్ (దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్, స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల) 7. పద్మాకర్ దివాన్‌జీ (కొత్తపేట జిలేబీ తయారీదారుడు) 8. వెంకటేశ్వర రావు (వెటర్నరీ అసిస్టెంట్ మలక్‌పేట్, స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ) 9. స్వప్నారెడ్డి (సంతోష్‌నగర్, ఎంబిఎ విద్యార్థి) 10. ఆనంద్‌కుమార్ (బిటెక్ ఇసిఇ చివరి సంవత్సరం, నోవా కళాశాల, రామోజీ ఫిలం సిటీ వద్ద, స్వస్థలం అనంతపురం జిల్లా 11. తిరుపతయ్య (గోదావరిఖని, కరీంనగర్ జిల్లా) 12. శ్రీనివాసరెడ్డి (రెంటచింతల, గుంటూరు జిల్లా) 13. చోగారం కులాజీ (రాజస్థాన్) 14. గిరి (రామన్నపేట, నల్లగొండ జిల్లా) ఓమ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Read also: Raja Singh: రాజాసింగ్‌పై బీజేపీ హైకమాండ్ ఊహించని నిర్ణయం