Mehul Choksi : ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది.

విదేశాలకు పారిపోయిన మెహుల్ ఛోక్సీ
ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, అతడిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు అతడిని బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు. ఇక, ఛోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
చోక్సీకి ఆ దేశ పౌరసత్వం
అంతకుముందు.. పీఎన్‌బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్‌లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.
దేశం దాటిపోయిన మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు
కాగా, 2018 జనవరిలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.
Read Also: రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్… ఫొటోలు విడుదల