తిరుమల: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. 1978 నుండి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ భౌతిక దేహానికి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాళులర్పించారు. అంనతరం భూమన మాట్లాడుతూ.. ఆయనకు మరణం వేంకటేశ్వర స్వామి భక్తులకు తీరని లోటు అన్నారు.

గరిమెళ్ళ మరణించడం దురదృష్టకరం
అన్నమయ్య కీర్తనలను గానం చేసి నేటి తరం భక్తులకు అందించిన మహనీయుడు గరిమెళ్ళ బాలకృష్ణ మరణించడం దురదృష్టకరమని అన్నారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర,పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చిన గరిమెళ్ళ సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పాటలు పాడారు. గరిమెళ్ల మృతిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. గరిమెళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
800 పాటల రికార్డింగ్
కాగా, తిరుపతి భవానీనగర్‌లో తన స్వగృహానికి సమీపంలో ఆదివారం వాకింగ్‌కు వెళ్లిన గరిమెళ్ళ గుండెపోటుతో కన్నుమూశారు. గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ 1948 నవంబర్ 9న రాజమహేంద్రవరంలో కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు జన్మించారు. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఏ-గ్రేడ్ గాయకులుగా రాణించారు. భారత శాస్త్రీయ, ఆధ్యాత్మిక గాయకులైన గరిమెళ్ల టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టులో 1978లో గాత్ర కళాకారుడిగా ప్రవేశించి ఆస్థాన విద్వాంసుడి హోదాకు ఎదిగారు. అన్నమాచార్య కీర్తనలకు సంగీతాన్ని అందించడమే కాకుండా 800 పాటలను రికార్డింగ్ చేశారు. 50కి పైగా శాస్త్రీయ కృతులను విడుదల చేశారు. 300కు పైగా లలిత సంగీత పాటలకు గాత్రాన్ని అందించారు.