ఈరోజు మాఘ శుద్ధ సప్తమి సందర్భంగా భక్తులు సూర్య భగవానుని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ఏడాది రథసప్తమి వేడుకలు ఉదయం 7.53 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5.30 వరకు కొనసాగనున్నాయి. ముఖ్యంగా, ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు సూర్య భగవానుడికి పూజ చేయడానికి అనుకూలమైన సమయంగా పండితులు సూచిస్తున్నారు.
సూర్య భగవానుడు జిల్లేడు ఆకులను ఎంతో ప్రీతిగా స్వీకరిస్తారని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా భక్తులు ఉదయాన్నే స్నానం చేసే ముందు, రెండు భుజాలపై, శిరస్సుపైన మూడు చొప్పున జిల్లేడు ఆకులను ఉంచాలి. ఆపై వాటిపై కొద్దిగా బియ్యం ఉంచి స్నానం చేయడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ స్నానం శరీర శుద్ధితో పాటు ఆధ్యాత్మిక శుద్ధిని కూడా అందిస్తుందని నమ్మకం.

రథసప్తమి రోజున సూర్యుని ఆరాధన కోసం ఇంటి ముందు లేదా ఆలయ ప్రాంగణంలో రథం ఆకారంలోని ముగ్గు వేయాలి. ఈ ముగ్గు సూర్య భగవానుని రథాన్ని సూచిస్తూ, ఆయన్ను ఆహ్వానించే పవిత్ర చిహ్నంగా భావించబడుతుంది. ఈ ముగ్గు ముందు భక్తులు దీపాలను వెలిగించి సూర్యనమస్కారాలు చేయడం విశేష ఫలితాలను అందిస్తుందని చెబుతారు.
పూజ సందర్భంగా సూర్య భగవానుడికి నైవేద్యంగా పరమాన్నం సమర్పించడం విశేషమైన సంప్రదాయం. పరమాన్నం అంటే పాలు, బెల్లం, అన్నం కలిపిన స్వీట్ ప్రసాదం, ఇది సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. భక్తులు ఈ ప్రసాదాన్ని సమర్పించి, తలమీద ఉంచుకొని ఆహారంగా తీసుకుంటే, ఆయురారోగ్యాలతో పాటు సకల ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.
ఈ పవిత్రమైన రోజున స్నానం, పూజా విధానాలు పాటించడం ద్వారా భక్తులు తమ పాప విమోచనంతో పాటు ఆరోగ్యంగా, శుభ ఫలితాలతో జీవించగలరని పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి, ఈరోజు సూర్యోదయ సమయంలో స్నానం చేసి, గాయత్రి మంత్రం జపించడం విశేష శుభప్రదంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ పవిత్రమైన రథసప్తమిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు.