Dussehra : దసరా, విజయదశమి.. పేర్లు వేరైనా ఈ పండుగ వెనుక ఉన్న అంతర్లీన సందేశం ఒక్కటే. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం, పది తలల రావణాసురుడిపై శ్రీరాముడు విజయం సాధించిన సందర్భాన్ని దసరాగా జరుపుకుంటారు. రావణ దహనం ద్వారా చెడు ఆలోచనలు, అహంకారం, అధర్మం చివరకు ఓటమి పాలవుతాయనే సందేశాన్ని ప్రజలకు అందిస్తారు. మరోవైపు, మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి దుర్గాదేవి విజయం సాధించిన శుభదినాన్ని విజయదశమిగా భావిస్తారు. దుర్గామాత శక్తికి, ధైర్యానికి, దుష్టశక్తులపై ధర్మం సాధించిన విజయానికి ప్రతిరూపంగా భక్తులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
Read Also : విజయదశమి రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? అసలు కారణాలు ఇవే!

ప్రాంతాలు వేరైనా.. పండుగ సందేశం ఒక్కటే!
దేశవ్యాప్తంగా దసరా వేడుకలను వివిధ సంప్రదాయాలు, ఆచారాలతో నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల దిష్టిబొమ్మలను దహనం చేస్తూ రాముడి విజయాన్ని ఘనంగా చాటిచెబుతారు. పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో దుర్గాపూజ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దక్షిణ భారతదేశంలో విజయదశమి సందర్భంగా జమ్మిచెట్టుకు పూజలు చేయడం, ఆయుధ పూజ నిర్వహించడం, విద్యా కార్యక్రమాలను ప్రారంభించడం వంటి ఆచారాలకు ప్రాధాన్యం ఇస్తారు. తెలంగాణలో జమ్మి ఆకులను బంగారానికి ప్రతీకగా భావించి పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇలా ప్రాంతానికో సంప్రదాయం ఉన్నప్పటికీ, దసరా పండుగ ప్రతి ఒక్కరికీ ధర్మబద్ధంగా జీవించాలని, అహంకారాన్ని విడిచిపెట్టాలని, ధైర్యంతో కష్టాలను ఎదుర్కోవాలని బోధిస్తుంది. మనలోని చెడు లక్షణాలను విడనాడి మంచి ఆలోచనలు, సత్ప్రవర్తనతో ముందుకు సాగడమే విజయదశమి అందించే అసలైన సందేశం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :