తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. సన్నిధానం వద్ద 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే మాస పూజలు, 12 రోజుల విషు పూజల సందర్భంగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా అమలు చేస్తామన్నారు.

ప్రతి భక్తునికి 20 నుంచి 25 సెకన్ల పాటు దర్శనం
ఇది విజయవంతమైతే తదుపరి మండల మకరవిళక్కు సీజన్‌లోనూ దీన్ని కొనసాగిస్తామని తెలిపారు. మెట్లను ఎక్కిన వెంటనే ప్రస్తుతం భక్తులను ఒక వంతెన మీదికి మళ్లిస్తున్నామని అక్కడ వారు కొంత సమయం క్యూలో వేచి ఉండి అనంతరం స్వామి దర్శనం కోసం మరోవైపునకు వెళ్తున్నారని ప్రశాంత్ చెప్పారు. ఈ పద్ధతిలో భక్తులకు కేవలం ఐదు సెకన్ల వరకే దర్శనభాగ్యం దక్కుతోందన్నారు. భక్తులు మెట్లు ఎక్కిన వెంటనే దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొత్త మార్పు కారణంగా ప్రతి భక్తునికి 20 నుంచి 25 సెకన్ల పాటు దర్శనం చేసుకునే వీలు కలుగుతుందన్నారు.