ఆషాఢ మాసం (Ashada Masam) ప్రారంభంతో విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలుగింటి ఆడపడుచుల ఆరాధ్య దేవత అయిన కనకదుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శనివారం, ఆదివారాల్లో వారాంతపు సెలవులను ఉపయోగించుకుని బృందాలుగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం నాటికి 40 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
శీఘ్ర దర్శన ఏర్పాట్లు – టికెట్లు నిలుపుదల
భక్తుల భారీ రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతరాలయ దర్శనం, విఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. రూ.100, 300, 500 టికెట్ల జారీని కూడా నిలిపివేసి, సామాన్య భక్తులకు మాత్రమే శీఘ్ర దర్శనం కల్పిస్తున్నారు. బంగారు వాకిలి నుంచి అన్నిరకాల భక్తులకు దుర్గమ్మ దర్శన భాగ్యం కలిగేలా ఏర్పాటు చేశారు. ఇక భక్తులు దర్శనం అనంతరం 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు.
భక్తుల సౌకర్యాలకు ప్రత్యేక ఏర్పాట్లు – ఈవో నేరుగా పర్యవేక్షణ
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అదనపు ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో తిరుగుతున్న భక్తులకు చల్లటి నీటిని అందించడంతో పాటు, కార్పెట్లు వేసి, బిస్కెట్ ప్యాకెట్లను కూడా అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఈవో శినా నాయక్ స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ, అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ భక్తులకు సజావుగా సేవలందించేందుకు కృషి చేస్తున్నారు.
Read Also : Tragedy : తుంగభద్ర లో స్థానానికి దిగి ముగ్గురు మృతి