సీఎం రేసులో పర్వేశ్ వర్మ ముందంజ..!
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో గెలిచింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో హస్తినలో ప్రభుత్వ ఏర్పాటుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు కూడా మొదలు పెట్టింది.

అయితే, సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. రేసులో పలువురు ముఖ్య నేతల పేర్లు వినిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ హైకమాండ్ ముహూర్తం పెట్టినట్లు తెలిసింది. ఇందుకోసం 48 మందిలో 15 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితా సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో తొమ్మిది మందిని షార్ట్ లిస్ట్ చేసి.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, స్పీకర్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగించుకొని ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.
ప్రధాని మోడీ ఢిల్లీ వచ్చిన వెంటనే ప్రధానితో అమిత్ షా, జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్య నేతలు భేటీ కానున్నట్లు సమాచారం. మోదీతో చర్చలు జరిపి ఓ అంచనాకు రానున్నట్లు తెలిసింది. ఇక ఈ నెల 17, 18 తేదీల్లో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. 19, 20 తేదీల్లో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.