న్యూఢిల్లీ: విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. పరువు నష్టం కేసులో పుణె కోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీడీ సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీపై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.

అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణకు తాజాగా రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. దీంతో ఆయనకు కోర్టు రూ.25 వేల పూచీకత్తు బాండ్‌పై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్‌కు పూచీకత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. రాహుల్ ఈ కేసుకు ప్రత్యక్షంగా హాజరుకాలేదు. అయితే కోర్టు రాహుల్‌కు శాశ్వత మినహాయింపు కల్పించిందని ఆయన తరఫు లాయర్ మిలింద్ పవార్ పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
కాగా, 2023లో లండన్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ – హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘స్నేహితులతో కలిసి ఓ ముస్లీం యువకుడిని చితకబాది ఆనందించానని స్వయంగా సావర్కర్ తన పుస్తకంలో రాసుకున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. అయితే అది పూర్తిగా అవాస్తవమని, ఊహాజనిత ఆరోపణలు అని సావర్కర్ మనుమడు సాత్యకి సావర్కర్ రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేశారు. రాహుల్ ఉద్దేశపూర్వకంగా సావర్కర్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు పదేపదే యత్నిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు.