మధ్యప్రదేశ్ జబల్పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఇంద్రజిత్ (66) అనే వృద్ధుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్యులు ఆయన చనిపోయినట్లు నిర్ధారించి డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ ఘటన కుటుంబసభ్యులను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది.కుటుంబీకులు ఇంద్రజిత్ బాడీని ఆస్పత్రి నుంచి తీసుకెళ్తున్న సమయంలో అనుకోని సన్నివేశం చోటుచేసుకుంది. వృద్ధుడి శరీరంలో చలనం కనిపించడంతో కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
![Death certificate of surviv](https://vaartha.com/wp-content/uploads/2025/01/Death-certificate-of-surviv.jpg.webp)
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ అవాంఛిత ఘటన చోటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఓ పేషెంట్ చనిపోయాడని నిర్ధారించడానికి కనీస పరిశీలన లేకుండా డెత్ సర్టిఫికెట్ జారీ చేయడం షాకింగ్ విషయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆస్పత్రి ఉన్నతాధికారులు స్పందించారు. నిర్లక్ష్యానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంద్రజిత్‌కు ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వృద్ధుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన వల్ల ఆస్పత్రి నిర్వహణలో లోపాలు వెలుగుచూడటంతో, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్యుల బాధ్యతారాహిత్యంపై చర్యలు తీసుకోవాలని సమాజం డిమాండ్ చేస్తోంది.