భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట (Dammapeta) మండల కేంద్రంలో కోళ్ల దొంగతనం కేసు విచారణ కోసం వచ్చిన ఏలూరు జిల్లా, చింతలపూడి పోలీసులను (AP Police) స్థానిక గ్రామస్తులు నిర్బంధించారు. ఒక మహిళ ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి ఇబ్బందులకు గురిచేయడం, అలాగే సీసీ కెమెరాలను తొలగించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో మహిళలు అని కూడా చూడకుండా ఇబ్బందులకు గురి చేశారని ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా విచారణ
కోళ్ల దొంగతనం కేసు(Chicken Theft Case) విచారణకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తమ విచారణ గురించి స్థానిక దమ్మపేట పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపించారు. స్థానిక పోలీసులకు తెలియకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులు వచ్చి విచారణ చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఏపీ పోలీసులను గ్రామం నుంచి వెళ్ళనివ్వకుండా నిర్బంధించారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చిన స్థానిక పోలీసులు
గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గ్రామస్తుల ఆరోపణలను పరిశీలించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం, స్థానిక పోలీసుల జోక్యంతో ఏపీ పోలీసులను గ్రామస్తులు విడిచిపెట్టారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.