ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) రాంపూర్ కోర్టు(Rampur Court) ఆవరణలో ఒక మహిళ తన భర్తను చెప్పుతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన వెనుక తన ఆవేదన, అంతులేని బాధ ఉన్నాయని ఆ మహిళ కన్నీటిపర్యంతమయ్యారు. భరణం కేసు విచారణ కోసం కోర్టుకు వస్తే, తన భర్త ట్రిపుల్ తలాక్(Triple Talaq) చెప్పి దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం తిరగబడాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

వరకట్న వేధింపులు, ట్రిపుల్ తలాక్
రాంపూర్‌కు చెందిన ఓ మహిళకు 2018లో వివాహమైంది. పెళ్లయిన కొద్ది కాలానికే అదనపు కట్నం కోసం ఆమె భర్త వేధించడం మొదలుపెట్టాడని ఆరోపించారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో ఇంట్లో నుంచి గెంటేశాడని, ఆ తర్వాత భరణం కోసం కోర్టును(court) ఆశ్రయించగా పిల్లలను కూడా లాక్కున్నాడని ఆమె వాపోయారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం జరిగిన విచారణకు బాధితురాలు తన అత్తతో కలిసి కోర్టుకు హాజరయ్యారు.
విచారణ ముగిసి బయటకు వస్తున్న సమయంలో ఆమె భర్త, మామ అడ్డగించి కేసును వెనక్కి తీసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఆమె నిరాకరించడంతో, మామ ప్రోద్బలంతో భర్త అక్కడికక్కడే మూడుసార్లు తలాక్ చెప్పి ఆమెపై దాడికి దిగినట్టు బాధితురాలు వివరించారు.
బాధితురాలి ఆవేదన, డిమాండ్లు
ఈ అనూహ్య పరిణామంతో ఆగ్రహానికి గురైన ఆ మహిళ, ఆత్మరక్షణ కోసం తన కాలి చెప్పు తీసి భర్త కుర్తా పట్టుకుని చితకబాదారు. మామపై కూడా దాడి చేశారు. అక్కడున్న వారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ, “వాళ్లిద్దరూ నన్ను కొడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. నా జీవితాన్ని నాశనం చేసి, ఇప్పుడు తలాక్ చెప్పి దాడి చేస్తే ఏ మహిళ మాత్రం సహిస్తుంది? అందుకే తిరగబడ్డాను. నాకు న్యాయం కావాలి. నా ఇద్దరు కూతుళ్లను నాకు అప్పగించి, వారికి భరణంతో పాటు మాకు అదే ఇంట్లో నివసించే హక్కు కల్పించాలి. నిందితులకు కఠిన శిక్ష పడాలి” అని డిమాండ్ చేశారు.
ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మహిళ భర్తపై ఎందుకు దాడి చేశారు?
భరణం కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసి, మూడుసార్లు తలాక్ చెప్పి ఆమెపై దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం ఆమె తిరగబడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: