రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో జిల్లా కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై అప్పటి జిల్లా ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. నిజం గెలిచిందని తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందని అన్నారు. ప్రణయ్ హత్య కేసులో 9 నెలలు కష్టపడి ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, అన్ని ఆధారాలతో 1600 పేజీలతో చార్జిషీట్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నేడు తుది తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు.

ప్రణయ్ హత్య
ప్రణయ్-అమృత ప్రేమ వివాహాన్ని అమృత తండ్రి మారుతీరావు అస్సలు సహించలేకపోయాడు. అమృత అంటే మారుతీరావుకు ప్రాణం అని పేర్కొన్న ఏవీ రంగనాథ్, మారుతీరావుకు పిల్లల విషయంలో చాలా ప్రేమ ఉందని, అమృత కోసం ఇంట్లో 15-20 అడుగుల ఫ్లెక్సీలు కూడా పెట్టేవాడని చెప్పారు. అయితే, కులాంతర వివాహం అన్న విషయాన్ని ఆయన తట్టుకోలేకపోయాడని తెలిపారు. మారుతీరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో, తనకు మిత్రుడిగా ఉన్న అబ్దుల్ బారీతో హత్య ప్లాన్ చేశాడు. గతంలో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో సహాయం చేసిన అబ్దుల్ బారీని, అదే విధంగా తన కూతురు విషయంలో కూడా అడిగాడని ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ఈ క్రమంలో ప్రణయ్‌ను హత్య చేయించాలని ప్లాన్ చేసుకొని, బీహార్‌కు చెందిన సుభాష్ శర్మను హత్యకు రెడీ చేశారని వివరించారు. 2018 సెప్టెంబర్ 14న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ను సాయంత్రం ఇంటి ముందు అందరి సమక్షంలో అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపింది. పరువు హత్యలను వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అమృతకు మద్దతుగా వివిధ సంఘాలు, ప్రముఖులు నిలిచారు.
కోర్టు తీర్పు
కోర్టు తీర్పు ప్రకారం, ఏ2 నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. అయితే, ఈ తీర్పుతో అమృత కుటుంబం సంతృప్తి వ్యక్తం చేయగా, శ్రవణ్ కుమార్తె మాత్రం కన్నీరుమున్నీరుగా విలపించింది. నాన్న ఏ తప్పూ చేయలేదు కావాలనే మా కుటుంబాన్ని ఇరికించారు అంటూ శ్రవణ్ కుమార్తె తన గోడును బయటపెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు 2020లో హైదరాబాద్‌లో ఓ లాడ్జిలో సూసైడ్ చేసుకున్నాడు. తన కూతురిని ఎంతో ప్రేమించినప్పటికీ, ఆమె తనకు ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై హత్య చేయించాడు. కానీ, హత్య అనంతరం కోర్టు తీర్పుతో శిక్షలు విధించబడటంతో మనస్తాపంతోనే మరణాన్ని ఎంచుకున్నాడు. ఈ కేసు విచారణలో 102 మంది సాక్షులుగా హాజరయ్యారు. కేసుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా న్యాయస్థానం విచారణ జరిపింది. చివరకు నేడు (2025 మార్చి 10) తుది తీర్పు వెలువడింది. ఈ తీర్పును కొంత మంది ప్రశంసిస్తుండగా, మరికొందరు శ్రవణ్‌కు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు