అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు కలియుగంలో ఏడుకొండలుగా పిలవబడే శ్రీ వేంకటాచలంపై శ్రీ వేంకటేశ్వరునిగా కొలువై ఉన్నాడు. అంతటి ఆనందరూపుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని వేల సార్లు దర్శించి తరించిన అన్నమాచార్యులు స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని సంకీర్తనలో మన కళ్లెదుట ప్రత్యక్షం చేశారు. మహిమాన్వితమైన దేవదేవుని బ్రహ్మోత్సవాలు కనులారా భక్తులందరూ చూసి తరించాల్సిందే.
ఆనాడు అన్నమాచార్యులు బ్రహ్మోత్సవాల పెద్దగా వ్యవహరించి, ఆయనే స్వయంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. పది రోజులు స్వామిని సేవించి కీర్తించేవారు. పది రోజుల సేవలను, శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని పై సంకీర్తనలో మన కళ్ళెదుట అన్నమయ్య ప్రత్యక్షం చేశాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏటేటా బ్రహ్మోత్సవాలు జరగడం సంప్రదాయం. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య ఇతోధికంగా పెరుగుతూ తిరుమలగిరులు గోవింద నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంటాయి. భజన బృందాలు, కోలాటాలు, దైవిక, పౌరాణిక పాత్రధారణలతో, ఆధ్యాత్మిక ప్రవచనాలతో, నాద నీరాజనాలతో నిర్విరామంగా ఒక పవిత్ర శోభ సంతరించు కుంటుందీ తిరుమల పుణ్యక్షేత్రం. నిత్య కళ్యాణ చక్రవర్తికి నిత్యోత్సవాలు, విశేష ఉత్సవాలు ఎన్నో.. ఎన్నెన్నో జరుగుతుంటాయి. అన్నిటి కంటే బ్రహ్మోత్సవాలు స్వయంగా సృష్టికర్త బ్రహ్మదేవుడే భగవదాజ్ఞతో ప్రారంభించి నిర్వహించడం ఈ ఉత్స వాల విశేషం. శేషం. తొమ్మిది రోజుల వాహన సేవల్లో గరుడోత్సవం. రథోత్సవం, చక్రస్నానం మరింత అశేష జనసందోహంతో, భక్తిపారవశ్యంతో ఆనందోత్సాహాలతో స్వామివారిని అలరింపజేస్తాయి.
మూడు నామాల దేవుడు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు… ఆపద మొక్కుల స్వామివారికి ప్రత్యేకత. ప్రతి శుక్రవారం ఉదయం అభిషేక సేవ అనంతరం 16 తులాల పచ్చకర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్ళీ గురువారం (Thursday) వరకూ అలానే ఉంటాయి. గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంత తగ్గిస్తారు. శుక్రవారం ఉదయం మాత్రమే స్వామివారి అభిషేక సేవ సమయంలో మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. వారానికి (per week) ఒకసారి మాత్రమే స్వామివారికి నామాలు దిద్దుతారు. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియ జేస్తాయి. సత్వగుణం భక్తుల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచిస్తుంది నిలువుబొట్టు. ఇక ఎరుపురంగు అనురాగానికి ప్రతీక. ఎరుపు లక్ష్మీస్వరూపం. శుభసూచకం, మంగళకరమైనది కూడా. వైష్ణవులు వడగలై, తెంగలై అనే రెండు తెగలు ఉన్నారు. వడగలై ‘యు’ ఆకారంలో నామం దిద్దుకుంటారు. తెంగలై ఆంగ్ల అక్షరంలో ‘వై’ ఆకారంలో తిరుమానం దిద్దుకుంటారు. అయితే ఈ రెండు ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం ‘ప’ను పోలి ఉంటుంది. దీన్నే తిరుమణికాపుగా పిలుస్తారు.
బంగారు వరలక్ష్మి
ఏడు కొండల వేంకటేశ్వరుని దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని బంగారు వాకిలిలో వెలుపలకు వచ్చిన భక్తులు విమాన వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తలచుకోగానే ముందుగా భక్తులకు గుర్తుకు వచ్చేది మూడు నామాలు. ఆ మూడు నామాలు శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ రూపానికి ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ మూడు నామాలు భక్తులకు పెద్దగా కనిపించేలా స్వామివారికి తీర్చిదిద్దుతారు. అలిపిరి మెట్ల దారిలో నడిచివెళ్ళే భక్తులకు మూడు నామాల కొండ కనిపిస్తుంది. అదే మోకాళ్ల పర్వత గోపురం. సాక్షాత్తు భగవంతుడు మూడు నామాలు ధరించి తన భక్తులు కూడా మూడు నామాలు ధరించాలని చెప్పినవే. ఈ నామాలు అజ్ఞానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. మొదటిసారి రామానుజాచార్యులు తన స్వహస్తాలతో శ్రీ వేంకటేశ్వరునికి మూడు నామాలు అలంకరించారట. తిరునామాలు అలంకరించడం అక్కడ నుండి ఆలయంలోపల స్వామివారి హుండీలో కానుకలు సమర్పించే ముందు ఎడమ వైపున ప్రాకారానికి పైన నిలువెత్తు ‘బంగారు వరలక్ష్మి’ ప్రతిమ అమర్చబడి ఉంది. ధన వర్షాన్ని కురిపిస్తూ భక్తులను అనుగ్రహించే ఈ అమ్మ, శ్రీనివాసుడికి సరిగ్గా ఈశాన్యంలో ఉండటం విశేషం. స్వామివారికి కానుకలు, మొక్కుబళ్లు సమర్పించిన భక్తులకు ఈ వరలక్ష్మి ఇబ్బడిముబ్బడిగా సంపదలు ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
బ్రహ్మోత్సవ వాహనసేవలు
”బ్రహ్మ’ అంతటివాడు ముందు నిలబడి జరిపించే ఉత్సవం కనుక ‘బ్రహ్మోత్సవం’ అనే పేరు వచ్చింది. ఏడు కొండల వేంకటేశ్వర స్వామికి సౌరమానం ప్రకారం కన్యా మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసంలో, ఆశ్వయుజ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అధిక మాసం వచ్చినపుడు తిరుమల తిరుపతి దేవస్థానం రెండు సార్లు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒకటి: సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు, రెండవది: నవరాత్రి ఉత్సవాలుగా జరిపిస్తారు. వైఖానస ఆగమం ప్రకారం మొదటి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం, ధ్వజావరోహణం తప్పనిసరి. రెండవ బ్రహ్మోత్సవంలో ఈ రెండూ ఉండవు. అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి.

అంకురార్పణ
ఏడుకొండల శ్రీ వేంకటేశ్వరుని తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో అరంభమవుతాయి. మొదటి ఘట్టంగా ధ్వజారోహణం ముందురోజు సాయంకాలం అనంత, గరుడ, శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనులవారు మాడోత్సవాలకు బయలుదేరి తిరువీధుల్లో ఊరేగుతూ ఆలయానికి పడమర వైపు వసంతోత్సవ మండపంలో ఆలయ అర్చకులు భూదేవిని పూజించి, పుట్టమన్ను సేకరించి మళ్ళీ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ‘మృత్సంగ్రహణం’తో అలా తెచ్చిన మట్టిలో నవ ధాన్యాలను ఆరోపింపజేస్తారు. దీన్నే ‘అంకురార్పణ’ అంటారు.
బ్రహ్మరథం
తొమ్మిది రోజుల ఉత్సవాల్లో బ్రహ్మ సారథ్యం సంకేతంగా ఎటువంటి ఉత్సవ మూర్తులు లేని ఖాళీ బ్రహ్మరథాన్ని ప్రతిరోజూ మలయప్ప స్వామి ఊరేగింపు ముందు నడిపిస్తారు. ఈ రథంలో నిరాకార, నిర్గుణ స్వరూపంతో బ్రహ్మదేవుడు ఉండి ఉత్సవ కార్యాన్ని నిర్వహిస్తాడు. అందుకే ముందుగా ఈ రథం కదులుతుంటుంది.
ధ్వజారోహణం
‘నభూతో నభవిష్యతి’ అన్నట్లుగా తొమ్మిది రోజులు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతలనూ ఆహ్వానిస్తూ, స్వామివారి వాహనం గరుడుని చిత్రాన్ని కొత్త పసుపు వస్త్రంపై చిత్రీకరిస్తారు. దీన్ని ధ్వజస్తంభం మీదకు కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో మీన లగ్నంలో కొడితాడు కట్టి’ నూతన కేతాన్ని వేద పండితులు, ఆలయ అర్చకులు వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ బంగారు ధ్వజ స్తంభంపై ఎగురవేస్తారు. ఈ ధ్వజారోహణం సందర్భంగా ముద్గలాన్నం (పెసర పులగం) నివేదిస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానాన్ని కోరేవారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం, బంగారు ధ్వజం పై ఆకాశానికెగసిన గరుడుడు బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సకల సపరివార దేవతలను, భక్తులను ఆహ్వానిస్తారు.

మొదటి రోజు రాత్రి పెద్ద శేషుని సేవ
తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు శ్రీకారంగా ధ్వజారోహణం జరిగిన రాత్రి తొలి వాహనంగా ఏడు పడగల బంగారు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ఉత్సవం జరుగుతుంది. శ్రీనివాసుడు శేషాద్రిపై కొలువుదీరాడు. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్స వాల్లో శేషుడికి ప్రాధాన్యమిస్తూ తొలిరోజు తొలి వాహనంగా పెద్ద శేష వాహనంపై ఊరేగుతారు. మన శరీరంలో మూలాధారం నుండి సహస్రారం వరకు సర్పాకారంలో ఉన్న కుండలీశక్తిని జాగృతం చేయమని బోధించడమే ఈ ఊరేగింపు అర్థం.

చిన్న శేష వాహనం
బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం తిరుమలేశుని ఉత్సవమూర్తి మలయప్పస్వామి ఒక్కరే ఐదు పడగల చిన్న శేష వాహనంపై ఊరేగుతాడు. ఈ శేషుడు నారాయణ సంభూతుడు. స్వామికి-శేషునికి ఉన్న సంబంధం అటువంటిది. అందుకే రెండవ రోజు ప్రీతితో మళ్లీ శేష వాహనంపై దర్శనమిస్తాడు. ఈ చిన్నశేషుడే వాసుకి.
హంస వాహనం
బ్రహ్మోత్సవాలలో రెండో రోజు రాత్రి శ్రీ స్వామివారు వీణాపాణియై సరస్వతి మూర్తిగా దర్శనమిస్తారు. హంస పాలలోని నీళ్లను వదలి పాలను తాగినట్లుగా భగవంతుడు పాపాలను క్షమించి వాత్సల్యంతో భక్తులను దగ్గరికి చేరదీస్తాడని చెప్పడం కోసం ఈ హంస వాహనం.
సింహ వాహనం
బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై దర్శనమిస్తారు. మృగరాజైన సింహాన్ని సైతం నేనేనంటూ మనుషుల్లో జంతు స్వాభావికమైన హింసా వృత్తిని పోగొట్టుకోవాలని స్వామి ఉద్భోద. అనంత తేజోమూర్తి శ్రీనివాసుడు. రాక్షసుల మనస్సులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాఙ్మయం కీర్తిస్తుంది. భగవంతుని అవతారాలలో నృసింహ స్వామి అవతారం నాల్గవది. ధర్మరక్షణకై తాను నృసింహ రూపాన్ని ధరించిన స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్టించి రావడం దుష్ట శిక్షణ, శిష్ట జన రక్షణకు సంకేతం. వజ్రకిరీటం, చెవులకు రవ్వలపోగు, శ్రీవత్సం, లక్ష్మీకౌస్తుభం అలంకరణలో ప్రత్యేకత.
ముత్యపు పందిరి వాహనం
బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవిలతో మలయప్ప స్వామివారు ప్రత్యక్షమవుతాడు. ముత్యాలు విలువైనవి. చల్లదనాన్ప్రసాదిస్తాయి, తెల్లని కాంతులీనుతాయి. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తుంది. ఎంతో ప్రాశస్త్యమున్న ముత్యాలను పందిరిగా రూపొందించిన వాహనంలో దేవదేవుడు మురిపెంగా ముచ్చట గొల్పుతూ ఊరేగుతాడు. ముత్యం చంద్రునికి ప్రతీక. చంద్రుడు ఆరోగ్య ప్రదాత. సకల సౌభాగ్యాలను చేకూర్చుతుందని నమ్మకం.

కల్పవృక్ష వాహనం
బ్రహ్మోత్సవాల వేళ నాలుగో రోజు ఉదయం మలయప్ప స్వామి ఉభయ నాంచారులతో కలసి ఊరేగే వాహనం కల్పవృక్ష వాహనం, దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతున్నపుడు అందులోంచి అన్ని రుతువుల్లోనూ పచ్చగా ఉండి కోరినవారి కోర్కెలను తీర్చే కల్పవృక్షం పుట్టింది. ఈ కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది. భక్తుల కోర్కెలను భగవంతుడు నెరవేరుస్తాడని చెప్పడానికి కల్పవృక్ష వాహనంపై స్వామి ఊరేగుతారని నమ్మకం.
సర్వభూపాల వాహనం
బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు రాత్రి ఉభయ నాంచారులతో కలసి మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతాడు. ఏడడుగుల ఎత్తు, పూర్తిగా బంగారు రేకులతో నిర్మించిన వాహనం దేవచోడ వంశానికి చెందిన ముట్లకుమార అనంతరాయులు ఇచ్చిన వాహనాలలో ఇదొకటి. సర్వభూపాలురలలో దిక్పాలకులు కూడా చేరుతారు. తూర్పు దిక్కునకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిర్రుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులై విరాజిల్లుతున్నారు.
మోహినీ రూపం
బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఉదయం శ్రీ స్వామివారు మోహినీ అవతారంలో జగన్మోహినిగా బంగారు పల్లకిలో సిగ్గులు, సోయగాలు ఒలకబోస్తూ దర్శనమిస్తాడు. పక్కనే శ్రీవారు దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో ఆలయం నుంచి వెలుపలకు విచ్చేస్తారు. ఉత్సవమూర్తి సహజంగా నిలబడిన రూపంలోగాక ఆసీనులైన భంగిమలో దర్శనమివ్వడం విశేషం.
స్త్రీలు ధరించే సకలాభరణాలతో స్వామివారిని అర్చకులు అలంకరించడం విశేషంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా వరద భంగిమలో కనిపించే స్వామివారి కుడి హస్తం మోహినీ అలంకరణలో అభయహస్త ముద్రణతో వుంటారు. స్వామివారికి పట్టుచీర, కిరీటం, పైన రత్న ఖచితమైన సూర్యచంద్ర సావేరి, వజ్రపు ముక్కుపుడక, బులాకి, శంఖుచక్ర స్థానంలో రెండు వికసించిన స్వర్ణ కమలాలను అలంకరిస్తారు.
గరుడ వాహనం
బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు రాత్రి జరిగే గరుడ వాహన సేవ అత్యంత విశిష్టమైనది. ఆలయంలో మూలవిరాట్టుకున్న మకరకంఠి, లక్ష్మీహారం తదితర వాటిని ఉత్సవ మూర్తులకు అలంకరించడం ఈ వాహన ప్రత్యేకత. మలయప్ప స్వామివారు ఈ వాహనంపై ఊరేగడానికి ముందు తమిళనాడులోని విల్లిపుత్తూరు నుంచి వచ్చిన పూలమాలలను, గొడుగులను, చిలుకలను స్వామివారికి అలంకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సమర్పించిన పట్టువస్త్రాలను గరుడ వాహనంలో స్వామివారికి అలంకరిస్తారు. కొత్త గొడుగుల నీడలో బంగారు గరుడినిపై వరద హస్తుడైన శ్రీ మలయప్పస్వామి భక్తులను కటాక్షించడం విశేషం.

హనుమంత వాహనం
ఆనంద నిలయంలో కొలువైన దేవదేవుని బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం శ్రీ మలయప్ప ఒక్కడే హనుమంతున్ని వాహనంగా చేసుకుని తిరు మాఢవీధుల్లో ఊరేగుతాడు. త్రేతాయుగంనాటి రాముడు కలియుగంలో వేంకటేశ్వరుడని నిరూపించడం ఈ వాహనంలోని పరమార్థం. శ్రీరాముడే దేవుడని నిత్యం కొలిచిన భక్తుడు హనుమంతుడు. భక్తితత్పరతను చాటిన హనుమంతుడి ద్వారా భక్తులు స్పూర్తి పొందడానికి వీలుగా హనుమంత వాహనంపై స్వామి ఊరేగడం ప్రత్యేకత.
స్వర్ణరథం
బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు మధ్యాహ్నం ఉత్సవ మూర్తులకు అత్యంత వేడుకగా వసంతోత్స వం జరుగుతుంది. ఈ వసంతోత్సవం రంగనాయకుల మండపంలో నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు బంగారు రథాన్ని అధిరోహిస్తాడు.
గజవాహనం
ఆరో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై ఊరేగుతారు. మొసలి బారికి చిక్కిన ఏనుగును మహావిష్ణువు రక్షించడం,
గజేంద్ర మోక్షం. శరణాగతులైన వారిని తాను రక్షిస్తానని చెప్పడం కోసం గజవాహనంపై స్వామివారు ఊరేగుతారు. గజం అహంకారానికి ప్రతీక. అహంకారాన్ని అణచిన మనిషి ఆరాధ్యుడవుతాడు. అహంకారం భగవంతుని దగ్గర దాసోహమంటుంది.
సూర్యప్రభ వాహనం
బ్రహ్మోత్సవాలలో ఏదో రోజు ఉదయం మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతారు. సప్తగిరీశుడు మలయప్పస్వామి వజ్రకవచం ధరించి ఈ వాహనంపై ఒక్కరే ఉదయ సూర్యకిరణాలు ప్రసరిస్తుండగా తిరువీధుల్లో ఊరేగుతాడు. సూర్యుడు కర్మసాక్షి. చరాచర ప్రపంచానికి వెలుగును ప్రసాదించే ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు. సూర్య మండల మధ్యస్థుడుని శంఖు, చక్ర, గదాయుధారి అనే అర్థంతో సూర్యప్రభ వాహనం ఉంటుంది.
చంద్రప్రభ వాహనం
బ్రహ్మాండ నాయకుని ఉత్సవాల్లో ఏడో రోజు రాత్రి మలయప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షిస్తారు. చంద్రుడు ఓషధీశుడు, భగవంతుడు చంద్రుని రూపంలో ఓషధులను పోషిస్తున్నాడనే అర్థంలో చంద్రప్రభవాహనం వుంటుంది. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రకాంతమణులు స్రవిస్తాయి. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది.

రథోత్సవం
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం రథంలో శ్రీ భూసహితంగా మలయప్ప ఊరేగుతారు. శరీరమే ఒక రథం. పంచేంద్రియాలు గుర్రాలు. మనసు వాటిని అదుపు చేసే పగ్గం. ఆత్మ రథచోదకుడు స్వామివారు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ భావాన్ని చాటిచెప్పడానికే రథంలో ఆలయ మాడ వీధులలో శ్రీవారిని అధిరోహింపజేసి ఊరేగిస్తారు. భక్తులు ఈ రథాన్ని గోవింద నామ స్మరణలతో లాగడం భక్తికి నిదర్శనం. సకల జీవులలో అంతర్యామిగా వున్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం మరింత విశేషం.
అశ్వవాహనం
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు రాత్రి జరిగే అశ్వవాహనం చివరిది. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనంపై కల్కి అవతారంలో వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చెప్పడమే ఈ వాహన సేవ ఉద్దేశం. భక్తుల కలిదోషాలను హరించేవాడు, శుభాలనొసగువాడు. ఇంద్రియాలను గుర్రాలుగా చెప్పడం, గుర్రాలను అదుపులోకి తెచ్చుకోవాలనడం ఆధ్యాత్మిక విషయం. ఇంద్రియ శాసకుణ్ణి
ధ్వజావరోహణం
నేనే అనే అర్థంలో ఈ వాహనం జరుగుతుంది. పద్మావతి- శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయవేళ, పరిణయ సమయంలో అశ్వం సాక్ష్యంగా నిలిచిందని పురాణాల గాథ.
చక్రస్నానం
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజులు ఉదయం, రాత్రి జరిగే వాహన సేవల్లో స్వామివారు భక్తులను కటాక్షించి మీ రక్షణకు నేనున్నానంటూ అభయమిస్తారు. అందుకే చివరగా భక్తుల పాపాలు తొలగిపోవడానికి వేల పుణ్యతీర్థాలు కలిసే పవిత్రమైన శ్రీవారి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారులకు చక్రస్నాన మహోత్సవం జరిపిస్తారు. ఆలయానికి పక్కనే వున్న ఈ పుష్కరిణిలో బ్రహ్మోత్స వాలు చివరి రోజు తెల్లవారుజామున శ్రీదేవి భూదేవిలతో మలయప్ప స్వామివారు పల్లకిపై, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారు మరో పల్లకిపై పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. అక్కడ అర్చకులు, జియ్యంగార్లు వేద పఠనం, శ్రీసూక్తంతో ఉత్సవ మూర్తులకు అభిషేకాదులు నిర్వహిస్తారు. తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును శ్రీవారి పుష్కరిణిలో మూడు సార్లు ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు.
ధ్వజావరోహణం
బ్రహ్మోత్స వాల్లో తొమ్మిదో రోజు రాత్రి ధ్వజావరోహణం ఉత్సవం ఆలయంలో జరుగుతుంది. శ్రీదేవి భూదేవిల మలయప్పస్వామి సమక్షంలో వేదపారాయణలతో, భేరీ నినాదాలతో మంగళవాద్యాలతో బ్రహ్మాది దేవతలకు, అష్టదిక్పాలకులకు వీడ్కోలు చెబుతూ గరుడకేతనాన్ని ధ్వజస్తంభంపై నుంచి కిందకు దించుతారు.
Read also: hindi.vaartha.com
Read also: