Humanity:మానవులుగా మనిషిని నిలబెడుతుంది. మానవత్వం ఉన్నప్పుడే సమాజంలో శాంతి, సామరస్యం నెలకొంటాయి. ఎదుటివారి కష్టాలను మన కష్టాలుగా భావించి, వారికి సహాయం అందించడమే నిజమైన మానవత్వం.
అందుకే “మానవత్వాన్ని మించిన మతం లేదు” అని పెద్దలు అంటారు. మానవత్వం అనేది కేవలం ఒక భావోద్వేగం, ఆలోచన మాత్రమే కాదు, ఇది ఒక నడవడిక, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా మానవత్వం అంటే సహానుభూతి, సామాజిక సహకారం, నైతిక భావనలు, సృజనాత్మకత, సంక్లిష్ట ఆలోచనలు వంటి లక్షణాలను కలిగి ఉండటం. మానవతా విలువలు అంటే
ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మనుషుల్లో మానవత్వం కరువౌతుందనే విషయం వినిపిస్తోంది. కొందరు మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తే మానవత్వం అనేది పూర్తిగా నశించి మానవుడు దానవుడిగా మారిపోతున్నాడా? అనిపిస్తుంది.
మానవత్వం అంటే ఏమిటి?
మానవత్వం అంటే కేవలం సుందరమైన శారీరక ఆకారం కలిగి ఉండటం కాదు. మనిషిగా జీవించడానికి అవసరమైన ఉన్నతమైన గుణాలు, విలువలు కలిగి ఉండటమే నిజమైన మానవత్వం. మానవులను జంతువుల నుండి వేరు చేసే ప్రధాన లక్షణం ఇదే. ఆదిమానవులు ఆవిర్భవించిన తొలినాళ్లల్లో బలమున్నవాడిదే రాజ్యంగా ఉండేది.
తరువాత కొన్ని కట్టుబాట్లు ఏర్పరచుకుని సంఘజీవనం సాగించడం మొదలెట్టారు. మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ అన్నాడు. మానవతా విలువలు అనేవి మానవ జీవనానికి ఆధారమైన నీతి, ధర్మం, సామాజిక సౌహార్ధాన్ని పెంపొందించే సూత్రాలు. ఇవి వ్యక్తుల మధ్య సహకారం, గౌరవం, శాంతిని ప్రోత్సహించే లక్షణాలను (characteristics) కలిగి ఉంటాయి.
ఇతరుల కష్టాలను చూసి జాలిపడటం, వారికి సహాయం చేయడానికి ముందుకు రావడం, ఆపదలో ఉన్నవారికి చేదోడు వాదోడుగా ఉండటం, కుల, మత, వర్గ భేదాలు లేకుండా మనుషులందరినీ సమానంగా ప్రేమించడం, ఎప్పుడూ నిజాయితీగా వుండి నిజం పలకడం, ఎవరికీ హాని చేయకుండా ఉండటం, హింసకు దూరంగా ఉండటం, ఇతరుల తప్పులను క్షమించి ముందుకు సాగడం, విభిన్న నమ్మకాలను, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, శాంతియుతంగా (Peacefully) కలిసి జీవించడం, సొంత లాభాపేక్ష లేకుండా ఇతరులకు మేలు చేయడం.. ఇవన్నీ మానవత్వానికి ప్రతీకలు. మానవత్వం మాయం కావొద్దు.
మనం కలిగి ఉండాల్సిన మంచి లక్షణాలు, నైతిక సూత్రాలు, ఇవి మనం ఇతరులతో, సమాజంతో ఎలా వ్యవహరించాలో తెలియజేస్తాయి. ఈ విలువలు లేకుండా మనిషి కేవలం ఆకారం మాత్రమే అవుతాడు తప్ప నిజమైన సంపూర్ణ మానవుడు కాలేదు.

ఆదిమానవుల్లో మానవత్వం
ఆదిమానవుల్లో మానవత్వం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి పురావస్తు శాస్త్రజ్ఞులు, మానవ పరిణామ శాస్త్రజ్ఞులు అనేక అధ్యయనాలు చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఆదిమానవులలో హోమో సేపియన్స్ తో పాటు వారి పూర్వీకులైన హోమో హెబిలిస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్స్ వంటి జాతులపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఆధారంగా ఆదిమానవుల్లో మానవత్వం ఉండేదని చెప్పడానికి చాలా బలమైన ఆధారాలు లభించాయి. ఆదిమానవులు ఇతరుల పట్ల జాలి, కరుణ చూపినట్లు ఆధారాలున్నాయి.
బలహీనమైన, గాయపడిన వారిని ఆదుకోవడం, పోషించడం వంటివి అప్పటి సమాజంలో సాధారణమని తెలుస్తోంది. కోబి ఫోరా (కెన్యా)లో 1.6 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ‘హోమో ఎర్గాస్టర్’ జాతికి చెందిన ఒక మహిళ అస్థిపంజరం కనుగొన్నారు. ఆమె తీవ్రమైన వ్యాధితో బాధపడినప్పటికీ చాలా వారాల పాటు జీవించి ఉన్నట్లు ఆమె ఎముకల వల్ల తేటతెల్లమైంది.
దీని అర్థం ఆమెకు ఆహారం, నీరు అందించి, క్రూర మృగాల నుంచి రక్షించి ఉండాలి.
ఇది ఇతరుల పట్ల శ్రద్ధకు స్పష్టమైన సూచన. నియోండర్తల్స్ కూడా వారి సమూహంలో అనారోగ్యంతో ఉన్న, గాయపడిన వారితోపాటు వృద్ధులైన వారికి నిస్వార్థంగా సేవ చేశారని ఆధారాలున్నాయి.
షానిదార్ 1 అనే నియోండర్తాల్ పురుషుడి అవశేషాలు దీనికి మంచి ఉదాహరణ. అతనికి ఒక చేయి లేకపోయినా, అనేక గాయాలు ఉన్నా, అతను చాలా కాలం జీవించాడు. నియాండర్తాల్స్ వంటి జాతులు కూడా సమాధులను సృష్టించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ సంఘటనను మానవత్వానికి ప్రతీకగా చెప్పవచ్చు.
ఇది అతని బృంద సభ్యులు అతనికి చాలా కాలం పాటు సంరక్షణ అందించారని సూచిస్తుంది. చనిపోయినవారిని ఖననం చేసే పద్ధతులు, కొన్ని రకాల ఆచారాలు ఆదిమానవుల మధ్య బలమైన భావోద్వేగ బంధాలు ఉన్నాయని తెలియజేస్తుంది. ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కలిగే దుఃఖం, దాన్ని పంచుకునే తత్వం మానవత్వానికి ప్రతీక. వేట, ఆహార సేకరణ వంటి కార్యకలాపాలలో ఆదిమానవులు ఒకరికొకరు సహకరించుకున్నారు.
ఇది వారి మనుగడకు అత్యవసరం. కుటుంబ సభ్యులు, బంధువులు ఒకరినొకరు చూసుకోవడం, పిల్లల సంరక్షణలో సహాయం చేయడం వంటివి కూడా సామాజిక మానవత్వంలో భాగమే. ఆదిమానవులు సమూహాలుగా జీవించారు. ఇది వారి మనుగడకు కీలకం. వేట, ఆహార సేకరణ, శిశువుల పెంపకంలో సహకారం వారిలో సామాజిక బంధాలను సూచిస్తుంది.
మానవతా విలువలు ఎందుకు
తగ్గుతున్నాయి?
భారతదేశంలో మానవతా విలువలు తరుగుతున్నాయనే ఆందోళన ఇటీవలి సంవత్సరాలలో అనేక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాల వల్ల చర్చనీయాంశంగా మారింది. మానవత్వం అనేది సానుభూతి, సహకారం, గౌరవం, నీతి, సామాజిక న్యాయం వంటి గుణాలను సూచిస్తుంది. కొన్ని ధోరణుల వల్ల ఈ విలువల తగ్గుదల ప్రస్పుటంగా కనిపిస్తుంది.

సామాజిక అసమానతలు
2025 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఆదాయ అసమానతలు మానవ అభివృద్ధిని
30.7 శాతం తగ్గిస్తున్నాయి. ఈ అసమానతలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తూ, సానుభూతి, సహకారం వంటి మానవతా విలువలను క్షీణింపజేస్తున్నాయి. కులం, మతం, ప్రాంతీయ విభజనలు సామాజిక ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. ఇటీవలి సంఘటనలు, ముఖ్యంగా మతపరమైన ఉద్రిక్తతలు, కుల ఆధారిత హింస, సహనం, సానుభూతి వంటి విలువలను దెబ్బతీస్తున్నాయి. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం, శ్రామిక వర్గంలో భాగస్వామ్యం తక్కువగా ఉండటం వల్ల స్త్రీ, పురుష సమానత్వం లోపిస్తోంది. ఇటీవల చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, సామాజిక దృక్పథంలో మార్పు నెమ్మదిగా జరుగుతోంది, ఇది లింగ ఆధారిత వివక్షను కొనసాగిస్తోంది. కుటుంబ బంధాలు బలహీనపడటం, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగుకావడం, తల్లిదండ్రులు పిల్లలకు విలువలను నేర్పించలేకపోవడం వంటివి ఒక కారణం. సమాజంలో విలువలను పెంపొందించడానికి అవసరమైన ఆదర్శప్రాయులు లేకపోవడం కూడా ఒక కారణం.
స్వప్రయోజనాలు
మనుషుల్లో వ్యక్తిగత స్వార్థం పెరిగింది. ఎవరి స్వప్రయోజనాలు వాళ్లు చూసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తికి దోహదపడుతున్నప్పటికీ, అవి తరచూ విద్వేష ప్రసంగం, తప్పుడు సమాచారం, సైబర్ బెదిరింపులకు వేదికగా మారుతున్నాయి. ఇది సామాజిక సంబంధాలను బలహీనపరుస్తూ, సానుభూతి, గౌరవం వంటి విలువలను తగ్గిస్తోంది. మీడియా, సోషల్ మీడియాలో హింస, అవినీతి, అనైతికతను ప్రచారం చేయడం వల్ల ప్రజలు బాధ్యత లేకుండా నిరక్ష్యంగా మారుతున్నారు. ఆధునిక జీవన శైలి, పట్టణీకరణ వల్ల వ్యక్తిగత లక్ష్యాలు, స్వప్రయోజనాలు సామాజిక బాధ్యత కంటే ఎక్కువ ప్రాధాన్యత సంతరించు కుంటున్నాయి. ఇది సముదాయ భావనను క్షీణింపజేస్తోంది.
పర్యావరణ విధ్వంసం
భారతదేశంలో పర్యావరణ వనరుల అతిగా వినియోగం, భూగర్భ జలాల క్షీణత, అడవుల నిర్మూలన వంటి సమస్యలు పర్యావరణ పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం లోపించడాన్ని సూచిస్తున్నాయి. 2025 నాటికి భూగర్భజలాలు గణనీయంగా తగ్గుతాయని ఐక్యరాజ్యసమితి నివేదిక సూచిస్తోంది. ఇది భవిష్యత్ తరాల పట్ల సానుభూతి లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుంది. వరదలు, కరువు, భూకంపాలు వంటి సహజ విపత్తులు, ఆర్థిక నష్టాలతో పాటు సామాజిక సంఘీభావాన్ని కూడా పరీక్షిస్తున్నాయి. 1980-2010 మధ్య కాలంలో ఇటువంటివి నాలుగు వందలకు పైగా సంఘటనలు జరిగాయి. విపత్తు సమయాల్లో సహాయం చేయడానికి బదులు, కొన్ని సందర్భాల్లో వివాదాలు, దోపిడీ పెరుగుతున్నాయి.

నైతికత లోపం
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2011-12 నుంచి 2022-23 ລ້ పేదరికం 27.1 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గినప్పటికీ ఇంకా 75.24 మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు. ఈ ఆర్థిక ఒత్తిడి కొన్ని సందర్భాల్లో నైతిక విలువలను విస్మరించేలా చేస్తోంది. అవినీతి, అనైతిక వ్యాపార పద్ధతులు సామాజిక న్యాయం, నైతిక విలువలను దెబ్బతీస్తున్నాయి. ఇవి సమాజంలో నమ్మకాన్ని తగ్గిస్తూ, సామాజిక సంబంధాలను బలహీనపరుస్తున్నాయి.
నైతిక క్షీణత
విద్యా వ్యవస్థలో నైతిక విలువలపై దృష్టి తగ్గడం వల్ల యువతలో సామాజిక బాధ్యత లోపిస్తోంది. విద్యా సంస్థలు తరచూ వాణిజ్య లక్ష్యాలపై దృష్టి సారిస్తున్నాయి. భారతదేశంలో సంప్రదాయంగా ఉన్న ‘వసుధైక కుటుంబం’ వంటి విలువలు కనుమరుగౌతున్నాయి. ఆధునిక జీవనశైలి, రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు, పాశ్చాత్య ప్రభావం వల్ల కొంతమేర క్షీణిస్తున్నాయి. గ్లోబలైజేషన్, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, వ్యక్తిగతవాదం పెరగడం వల్ల సంప్రదాయ విలువలు తగ్గుతున్నాయి. పాఠశాలల్లో నైతిక విద్యకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల యువతలో విలువలు కొరవడుతున్నాయి. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే అనే భావన పెరిగింది. పేదరికం, ఆదాయ అసమానతలు, నిరుద్యోగం వంటి ఆర్థిక కారణాల వల్ల ప్రజలు నైతిక విలువలను పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది అవినీతి, దోపిడీకి దారితీస్తోంది.
తల్లిదండ్రులను కడతేరుస్తున్న సంఘటనలు
ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలలో సైతం ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులనే తమ బిడ్డలు కడతేరుస్తున్నారు. ఇది చాలా శోచనీయ విషయం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపిన అనేక కేసులు నమోదయ్యాయి. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను చంపే చర్యను ‘ప్యారిసైడ్’ అని అంటారు. ఇందులో తల్లిని చంపడం మాట్రిసైడ్ అని, తండ్రిని చంపడం ప్యాట్రిసైడ్ అని పిలుస్తారు. కొడుకులు, కుమార్తెలు తల్లిదండ్రుల బీమా డబ్బు, వారసత్వం కోసం హత్యలు చేసిన సందర్భాలున్నాయి. ఈ కేసుల్లో తరచుగా కుటుంబ వివాదాలు, మాదకద్రవ్యాల వ్యసనం, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలు కూడా కలిసి ఉంటాయి. 1976-2007 ລ້ కాలంలో యునైటెడ్ స్టేట్స్ లో సంవత్సరానికి సగటున 113 మంది మాతృహత్యకు పాల్పడిన వారిని, 31 మంది యువకులు తండ్రులను, 18 మంది యువకులు తల్లులను చంపినట్లు అరెస్టు చేశారు. యునైటెడ్ స్టేట్స్ కు చెందిన మెనెంజెజ్ బ్రదర్స్ 198955 ລ້ తల్లిదండ్రులను హత్య చేశారు. ఈ కేసులో ఆస్తితో పాటు వ్యక్తిగత కారణంగా పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్కు చెందిన నికితా కాసాప్ టీనేజర్ 2025లో తన తల్లిదండ్రులను డబ్బు కోసం హత్య చేశాడని ఆరోపణలున్నాయి. 2010లో మొత్తం హత్యలలో తల్లిదండ్రుల హత్యలు సుమారు 2 శాతంగా ఉన్నాయి. యూరోపియన్ దేశాలలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. వాటి సంఖ్య చాలా తక్కువ. కొన్ని కేసులలో వారసత్వ వివాదాలు, కుటుంబ వ్యాపారాలపై నియంత్రణ కోసం హత్యలు జరిగాయి. బ్రెజిల్కు చెందిన సుజాన్ వోన్ రిచ్తోఫెన్ అనే ఆమె 2002లో తన ప్రియుడు, అతని సోదరుడి సహాయంతో తన తల్లిదండ్రులను హత్య చేసింది. ఈ కేసులో కూడా ఆస్తి ప్రధాన ప్రేరణలలో ఒకటిగా ఉంది. బెంగళూరులో 2025 సంవత్సరం మార్చి నెలలో ఒక న్యాయవాది తన అన్నను ఆస్తి పంపకాల విషయంలో జరిగిన గొడవలో కత్తితో పొడిచి చంపాడు. వారి తండ్రి చనిపోయినప్పటి నుండి ఆస్తి విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఒడిశాలోని బాలేశ్వర్ జూలై 2025లో 52 యేళ్ల వ్యక్తి తన అన్న చేతిలో హత్య చేయబడ్డాడు. వారి మధ్య చాలా కాలంగా భూ వివాదం ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. కర్ణాటకలోని హసన్లో కూడా జూలై 2025లో ఒక వ్యక్తి తన 70 యేళ్ల తండ్రిని, 50 యేళ్ల సోదరుడిని ఆస్తి తగాదాల కారణంగా హత్య చేశాడు. తండ్రి తన స్వార్జిత ఆస్తిలో కొంత భాగాన్ని అప్పులు తీర్చడానికి అమ్మేయడం దీనికి కారణం. కేరళలోని కన్నూర్ జూలై 2025లో ఇద్దరు సోదరులు తమ చెల్లిని రెండో పెళ్లి చేసుకోకుండా ఆపడానికి ఆమెను హత్య చేశారు. ఆమె నిరాకరించడంతో పెళ్లి ఏర్పాట్ల పేరుతో ఆమెను, ఆమె కాబోయే భర్తను ఇంటికి పిలిచి, ఆమెను కత్తితో పొడిచి చంపారు. హర్యానాలోని గురుగ్రామ్లో ఒక తండ్రి తన 25 యేళ్ల కూతురును జూలై 2025లో కాల్చి చంపాడు. ఆమె టెన్నిస్ కోచింగ్ పాటు, ప్రకటనలు, మోడలింగ్ కెరీర్ కొనసాగించాలనే కోరికపై కుటుంబంలో విభేదాలు ఉండటం దీనికి ఒక కారణం అని తెలుస్తోంది. సమాజం తన కూతురు సంపాదనపై వ్యాఖ్యలు చేస్తోందని అతను ఆందోళన చెందాడు.

ఇటీవల కాలంలో కేరళలో తల్లిదండ్రులను పిల్లలు చంపే కేసులు పెరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. దీనికి కారణాలు మాదకద్రవ్యాల వ్యసనం, డిజిటల్ ప్రపంచ ప్రభావం, సామాజిక దూరం, తక్షణ కోరికల నెరవేకపోవడం… వంటివి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 25 యేళ్ల కొడుకు తల్లిని డబ్బు కోసం చంపిన కేసు, మరొక 28 యేళ్ల కొడుకు తండ్రిని చంపిన కేసులు 2025 ఫిబ్రవరి 25న వెలుగు చూశాయి. నాగపూర్లో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి తన తల్లిదండ్రులను విద్య, వృత్తిపరమైన భేదాభిప్రాయాల కారణంగా హత్య చేసిన కేసు 2025 జనవరిలో వార్తల్లో నిలిచింది. ఇక్కడ డబ్బు కంటే భేదాభిప్రాయాలు ప్రధాన కారణం. మహారాష్ట్ర కొల్హాపూర్ సునీల్ రమా కుచ్ కొరవీ (38) అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. తన తల్లి డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన 2017 ఆగస్టు 28న జరిగింది. సునీల్ తన తల్లి శరీరాన్ని ముక్కలుగా చేసి, కొన్ని భాగాలను ఉడికించేందుకు యత్నించాడు. ఈ కేసులో ట్రయల్ కోర్టు సునీల్కు మరణశిక్ష విధించగా, బాంబే హైకోర్టు 2024లో ఈ తీర్పును సమర్థించింది. ఈ హత్యను హైకోర్టు ‘అత్యంత అసాధారణ నేరం’గా
వర్ణించింది. నెల్లూరు జిల్లాలో ఒక కొడుకు తన తల్లిదండ్రులను చంపడానికి సుపారీ ఇచ్చిన కేసు 2022 అక్టోబర్ 30న వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం డబ్బు కోసమే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కల్లూరి నర్సింహారావు అనే వ్యక్తి తాగుడుకు బానిసై, డబ్బుల కోసం తన తల్లి కల్లూరి పగడమ్మ (75)ను రోకలిబండతో కొట్టి హత్య చేసి తల్లి మెడలోని బంగారు కాసులను తీసుకుని పరారీ అయ్యాడు. ఈ ఘటన 2021లో తెలంగాణ భద్రాది కొత్తగూడెంలో దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేటలో జరిగింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో రాజశేఖర్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులు అప్పలనాయుడు (55), జయ (45)లను ఆస్తి విషయంలో తన చెల్లెలికి వాటా ఇవ్వడంపై కక్షతో హత్య చేశాడు. తెలంగాణ నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్ మక్కపల్లి సాయిలు అనే వ్యక్తి పింఛన్ డబ్బుల కోసం తన తల్లి మక్కపల్లి సాయవ్వ (57)ను కుర్చీ, బండరాయితో కొట్టి హత్య చేశాడు. సాయవ్వ ప్రభుత్వ పింఛన్తో జీవనం సాగిస్తుండగా, సాయిలు ఆ డబ్బులు తనకు ఇవ్వాలని గొడవపడి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ హత్యలు కేవలం డబ్బు/ఆస్తి వంటి భౌతిక విషయాల కోసం జరిగాయి, ఇవి తల్లిదండ్రుల పట్ల కనీస గౌరవం, ప్రేమ, బాధ్యత లేకపోవడాన్ని సూచిస్తాయి. కానీ ఈ ఘటనలు ఆ విలువలకు విరుద్ధంగా ఉన్నాయి. సమాజంలో ఆర్థిక ఒత్తిడి, వ్యసనాలు (మద్యం, డ్రగ్స్). నైతిక క్షీణత వంటి కారణాలు ఇటువంటి నేరాలకు దారితీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో ఇటువంటి హత్యలకు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 కింద జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించవచ్చు. అయినప్పటికీ మానవతకు మచ్చగా మిగిలే ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కా-తమ్ముడు, అన్నా-చెల్లెళ్ళు, తండ్రీ-కూతురు, ఉపాధ్యాయులు- విద్యార్థిలు ఇత్యాది వారి మధ్య అక్రమ సంబంధాలు, మానభంగం చేసిన సంఘటనలు, ప్రేమ వివాహాలు ఇష్టం లేక పరువు హత్యలు.. ఇలాంటివన్నీ మానవత్వానికే కళంకంగా మారిపోయాయి. అధిక కట్నం కోసం కోడళ్లను రాచి రంపాన పెట్టే అత్తమామలు, తల్లిదండ్రులతో పాటు అత్తమామలను వృద్ధాశ్రమాలకు వెళ్లగొట్టే సంతానం.. ఇలా చెప్పుకుంటూ టూ పోతే దానవత్వం ఎంతగా పెరిగిపోతుందో సునాయాసంగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మానవత్వం చిరునామా మటుమాయమౌతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మానవత్వపు విలువలు పెంచడానికి
పరిష్కార మార్గాలు
మానవత్వపు విలువలు అంటే దయ, కరుణ, గౌరవం, సమానత్వం, నిజాయితీ వంటి లక్షణాలు. ఈ విలువలు సమాజంలో పెరగడానికి అనేక మార్గాలు ఉన్నాయి. చిన్నప్పటి నుండే పాఠశాల విద్యలో మానవత్వపు విలువల గురించి బోధించడం చాలా ముఖ్యం, నీతి కథల ద్వారా సహానుభూతిని పెంపొందించే కార్యకలాపాలు, సామాజిక సేవ వంటివి పాఠ్యప్రణాళికలో భాగం కావాలి. పెద్దలకు కూడా విలువలతో కూడిన జీవితం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి వర్క్షాపులు, సెమినార్లు నిర్వహించవచ్చు. సినిమాలు, టీవీ కార్యక్రమాలు, సోషల్ మీడియా వంటివి మానవత్వపు విలువలను ప్రోత్స హించే కంటెంట్ను ప్రచారం చేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. వారు ప్రదర్శించే దయ, గౌరవం, నిజాయితీ పిల్లల పెంపకంలో కీలక పాత్ర పోషిస్తాయి. కుటుంబంలో తరచుగా విలువలు, నైతికత గురించి చర్చించడం, ఇతరుల పట్ల సానుభూతిని పెంపొందించడం చాలా అవసరం. కుటుంబంతో కలిసి స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఇతరులకు సహాయపడే తత్వం అలవడుతుంది. కమ్యూనిటీ కార్యక్రమాలు, పండుగలు, స్వచ్చంద కార్యక్రమాల ద్వారా ప్రజలు ఒకరికొకరు దగ్గరవడం, పరస్పర సహాయం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. కులం, మతం, ప్రాంతం, లింగం వంటి భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడటం. గౌరవించడం చాలా ముఖ్యం. సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పడానికి కృషి చేయడం మానవత్వపు విలువలను పెంపొందిస్తుంది. వివక్షను తొలగించడం, బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వడం అవసరం. వ్యక్తి తన బలాలు, బలహీనతలు, భావోద్వేగాలను అర్ధం చేసుకోవడం ద్వారా ఇతరుల పట్ల మరింత సానుభూతిని కలిగి ఉంటాడు. మనం పొందిన వాటికి కృతజ్ఞత కలిగి ఉండటం, ఇతరులకు సహాయం చేయడానికి ముందుకొచ్చేలా చేస్తుంది. ఇతరులను క్షమించడం, గత తప్పులను వదిలివేయడం వల్ల వ్యక్తిగత శాంతి, ఇతరుల పట్ల సానుభూతి పెరుగుతాయి. మాననత్వం, సమానత్వం, నీతిని ప్రోత్సహించే వ్యక్తులను ఆదర్శంగా చూపడం, సినిమాలు, సీరియల్స్, సామాజిక మాధ్యమాల ద్వారా సద్గుణాలను ప్రచారం చేయడం, తల్లిదండ్రులు పిల్లలకు చిన్న వయస్సు నుండే దయ, గౌరవం, నిజాయితీ వంటి విలువలను నేర్పడం, కుటుంబ సభ్యుల మధ్య సమయం గడపడం, సమస్యలను కలిసి పరిష్కరించడం ఇత్యాదివి చేయడం వల్ల మానవతా విలువలు కొంతలో కొంత పెరుగుతాయి.

కష్ట సమయాల్లో ఒకరికొకరు అండగా నిలబడటం ఇప్పటికీ భారతీయ కుటుంబాలలో ఒక బలమైన లక్షణం. కుటుంబ సంబంధాలలో మానవతా విలువలు తగ్గుతున్నాయనేది ఒక సంక్లిష్టమైన అంశం. దీనికి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు దోహదపడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సమయం కేటాయింపు, సంప్రదాయ విలువలను గౌరవించడం అవసరం. వృద్ధుల పట్ల, ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల నిరక్ష్యం పెరుగుతోందని కొన్ని సంఘటనలు సూచిస్తున్నాయి. వారిని ఒంటరిగా వదిలేయడం, ఆదరించకపోవడం వంటివి మానవతా విలువలు తగ్గుతున్నా యనడానికి నిదర్శనం. మానవుడు చంద్రునిపై అడుగుపెట్టాడు. అంతరిక్ష పరిశోధనలలో ఎంతో అభివృద్ధి సాధించడం నిజంగా గొప్ప విషయం. ఇది మానవ మేధస్సు, పట్టుదలకు నిదర్శనం. ఇంత అభివృద్ధి దిశగా పయనించిన మనుషుల మధ్య ప్రేమ, కరుణ, దయ, సహనం, సమానత్వం వంటి మానవతా విలువలు క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది.
ఆటవిక నీతిని అనుసరించే ఆదిమానవులే మానవత్వంతో బతికారనేది అనేకమంది పరిశోధకులు తేటతెల్లం చేశారు. ఇంత నాగరికత పెరిగిన తరువాత కూడా కులమతాల మధ్య కుమ్ములాటలు, గ్రామాల మధ్య వైషమ్యాలు, దేశాల మధ్య శత్రుత్వం, ప్రతి ఒక్కరూ ఆధిపత్యం పోరుకోసం ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించి పైచేయిగా ఉండాలనే కాంక్ష.. ఇత్యాది స్వార్థపూరిత అంశాలను నరనరాన జీర్ణించుకుని మానవత్వానికి చరమగీతం పాడి వ్యక్తిగత స్వార్థంతో క్షణ క్షణం ఒక యుద్ధమే చేస్తున్నారు. మనిషి జీవితం గాలిబుడగలాంటిది. అది ఏ క్షణం గాల్లో కలిసిపోతుందో ఎవరూ చెప్పలేరు. క్షణభంగురమైన ఈ జీవితం కోసం మానవత్వాన్ని మంటకలిపే పనులు చేస్తూ కొందరు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇటువంటివారు తాత్కాలికంగా స్వలాభం పొందినప్పటికీ భావితరాల వారి దృష్టిలో చరిత్రహీనులుగానే మిగిలిపోతారు. మానవత్వాన్ని మంటకలుపుతున్న ఈ దుష్టశక్తులను భావితరాలు క్షమించవు.. అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కాబట్టి మానవత్వాన్ని బతికించడం మానవ జన్మ ఎత్తిన ప్రతిఒక్కరి బాధ్యతగా భావించి నడచుకోవాలి.
Read also: hindi.vaartha.com
Read also: Freedom Struggle: మువ్వన్నెల వికసిత భారత్