History of Indian Currency: జేబులో ఒద్దికగా ఒరిగిపోయే కరెన్సీ నోట్లు….. తెర పై మెరిసే ఒక డిజిటల్ సంఖ్య… ఇవేవీ అందుబాటులో లేని తొలినాళ్లలో మనిషి తన నిత్యావసరాల కోసం ‘వస్తు మార్పిడి’ లేదా ‘బార్టర్ పద్ధతి’ పైనే ఆధారపడేవాడు. అయితే, నాగరికత విస్తరిస్తున్నకొద్దీ ఆ వ్యవస్థలోని లోటుపాట్ల వల్ల లావాదేవీలు సంక్లిష్టంగా మారాయి. దాంతో ధాన్యం, పశువులు, ఉప్పు, వస్త్రాలు, తోళ్లు వంటి నిత్యావసరాల అమ్మకాలు, కొనుగోళ్ల కోసం మన పూర్వీకులు వినూత్న ప్రయోగాలు చేశారు. శతాబ్దాల తరబడి జరిగిన ఆ మేథోమథనమే కరెన్సీ ఆవిష్కరణకు దారితీసింది.
ధాన్యపు రాశులు, సముద్రంలో లభ్యమయ్యే కౌరీ గవ్వల నుంచి మొదలైన కరెన్సీ అనేక మార్పులు చెంది, చివరికి ఇప్పుడు విరివిగా వాడుకలో ఉన్న లోహపు నాణేలు, కాగితపు నోట్లు, డిజిటల్ రూపీ, ఇంకా ప్రయోగ దశలో ఉన్న పాలిమర్ నోట్ల రూపాల్ని సంతరించుకుంది. ఈపరిణామ క్రమం ఎప్పటికప్పుడు రూపుమార్చుకునే మానవ నాగరికతకు నిలువుటద్దం పడుతుంది. ఆయా కాలాల ఆర్థిక పరిస్థితులు, రాజ్యాల సరిహద్దులు, విదేశీ వాణిజ్యం, మత విశ్వాసాలు, సాంకేతిక పరిజ్ఞానం… మొత్తంగా సమకాలీన సామాజిక స్థితిగతులను ఈ నాణేలు, నోట్లు ఆవిష్కరిస్తాయి.

History of Indian Currency: సింధులోయ నాగరికతలో ద్రవ్య ప్రమాణాలు
ప్రపంచమంతటా వస్తుమార్పిడి విరివిగా సాగుతున్న కాలంలోనే, సుమారు ఐదు ఏళ్ళ క్రితం సింధులోయ నాగరికత.. వినిమయ వ్యవస్థ చరిత్రలో ఓ కీలకమైన ముందడుగు వేసింది. హరప్పా, మొహెంజొదారో ప్రజలు విస్తృతమైన వస్తు మార్పిడితో పాటు, కచ్చితమైన కొలతలకు వీలైన గట్టి ‘చెర్ట్’ రాతితో రూపొందించిన తూకపు రాళ్లు, ప్రామాణిక కొలతలు కలిగిన స్టీటైట్ అనే మృదువైన రాతితో రూపొందించిన ముద్రలను వాడేవారు. ఇవి స్వయంగా కరెన్సీ కాకపోయినా, వస్తువుల బరువు, పరిమాణం, విలువలను ఒకే ప్రమాణంతో అంచనా వేసే వ్యవస్థ అప్పటికే ఉన్నట్లు సూచిస్తాయి. ఇదే కాలంలో మెసొపొటేమియా (నేటి ఇరాక్ లో ప్రాంతం)లో వెండి, ధాన్యం వంటి వస్తువులు లావాదేవీలలో విలువను నిర్ణయించేందుకు, చెల్లింపులకు కూడా ఉపయోగపడేవి. హరప్పన్లకు మెసొపొటేమియాతో వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్న నేపథ్యంలో, హరప్పా సమాజంలోనూ ఏదో ఒక రూపంలో ద్రవ్య మాధ్యమం ఉండి ఉండవచ్చనే సందేహం తలెత్తుతుంది. అయితే, ఇప్పటివరకు లభించిన ఆధారాలతో వారు ఉపయోగించిన నిర్దిష్ట ద్రవ్య మాధ్యమాన్ని గుర్తించడం సాధ్యం కాలేదు. అందువల్ల హరప్పన్లను కరెన్సీ వినియోగించిన తొలి సమాజాల్లో ఒకటిగా నిర్ధారించలేకపోయినా, విలువను కొలవడం, ప్రామాణీకరించడం, లావాదేవీలను క్రమబద్ధీకరించడం వంటి కరెన్సీ ఆవిర్భావానికి పునాది వేసే ఆర్ధిక భావనలు అప్పటికే అభివృద్ధి చెందాయన్న విషయం స్పష్టమవుతోంది.
గవ్వల వినియోగం, లోహపు నాణేల ఆవిర్భావం
క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దం నాటికే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్రపు గవ్వలు విలువైన వస్తువులుగా, ఆ తర్వాతి కాలంలో ద్రవ్యంగా కూడా వాడుకలోకి వచ్చాయి. సాధారణంగా చిన్న లావాదే లావాదేవీలకు • ఉపయోగపడే ఈ చిన్న సముద్రపు గవ్వలు.. భారత ఉపఖండంతో పాటు చైనా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలలో కూడా శతాబ్దాల పాటు ప్రధాన వినిమయ సాధనంగా నిలిచాయి. పదార్థానికి స్వయంగా విలువ లేకపోయినా, విస్తృత సమాజపు అంగీకారమే ద్రవ్యానికి విలువను ఆపాదిస్తుందనే ప్రాథమిక సూత్రానికి ఈ గవ్వల వినియోగమే పునాది వేసింది. అయితే నాగరికత విస్తరించిన కొద్దీ లావాదేవీల పరిమాణం పెరగడంతో, పెద్ద మొత్తాల్లో లావాదేవీలకు వాటిని తరలించడం భారంగా మారింది. పైగా, ప్రాంతాన్ని బట్టి వీటి లభ్యత, విలువలో వ్యత్యాసాలు ఉండేవి.

ఈ పరిమితులు కరెన్సీ చరిత్రలో నిర్ణయాత్మక మలుపైన ‘నాణేల’ ఆవిర్భావానికి దారి తీశాయి.
తరువాతి కాలంలో లోహాల కొలత, బరువు, స్వచ్ఛతతో పాటు వాటికి సమాజం, పాలకులు కల్పించిన విశ్వసనీ యత ఆధారంగా బంగారం, వెండితో పాటు రాగి, సీసం, ఇత్తడి వంటి.. లోహాలను నాణేలుగా మలిచారు. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో మహాజనపదాల కాలంలో లోహపు బిళ్ళలపై అచ్చులతో ముద్రించిన ‘కర్షాపణాలు’ లేదా ‘పంచ్ మార్క్’ నాణేలు వెలుగుచూశాయి. ఈ చిహ్నాలు ఆ కాలపు రాజకీయ, మత, సాంస్కృతిక విశ్వాసాలను ప్రతిబింబించేవిగా భావిస్తారు. కాలక్రమంలో మౌర్యులు నాణేల బరువు, స్వచ్ఛతలో ప్రామాణికతను సాధించారు. కుషాణ చక్రవర్తి కనిష్కుడి నాణేల్లో గ్రీకు, పర్షియన్ దేవతలతో పాటు బుద్ధుడి ప్రతిమ కూడా కనిపించడం నాటి సమాజంలో వివిధ సాంస్కృతిక, మత సంప్రదాయాల సహజీవనానికి నిదర్శనం. గుప్తులు వీణావాదనం, విలువిద్య వంటి భంగిమలతో కూడిన బంగారు నాణేలను ప్రవేశపెట్టి తమ సృజనాత్మకతను చాటుకున్నారు.
మన తెలుగు నేలను పాలించిన శాతవాహనుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి విడుదల చేసిన ఓడ. తెరచాపల చిహ్నాలు గల నాణేలు, సముద్ర వాణిజ్యానికి శాతవాహనులు ఇచ్చిన ప్రాధాన్యాన్ని చాటుతాయి. ఆ తర్వాత వచ్చిన విజయనగర రాజుల పరిపాలనా కాలం నాణేల చరిత్రలోనూ ఒక స్వర్ణయుగమే. వారు బంగారు నాణేలపై వేంకటేశ్వరుని చిత్రాన్ని ముద్రించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఆ వరహాలు సరిహద్దులు దాటి హిందూ మహాసముద్ర తీరప్రాంత వాణిజ్యం లోనూ ఆమోదం పొందాయి. ఈ సంప్రదాయానికి కొనసాగింపుగా ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి రూపాలతో ‘మూడు మూర్తుల వరహాలు’ లేదా ‘పగోడాలు’గా పిలిచే బంగారు నాణేలను ముద్రించింది.
తదనంతరం, తెలుగు నేలపైనే మరో చెప్పుకోదగిన పరిణామం చోటుచేసుకుంది. 1858లో హైదరాబాద్ నిజాం రాజ్యం మొఘల్ చక్రవర్తి పేరుతో నాణేలు ముద్రించే సంప్రదాయానికి స్వస్తి పలికి, తన సొంత పాలకుడి పేరుతో నాణేలు ముద్రించడం మొదలుపెట్టింది: వీటినే ‘హాలీ సిక్కా’, అంటే ప్రస్తుత ‘నాణెం’ అని పిలిచేవారు. ఆ తర్వాత 1918లో సొంతంగా కాగితపు నోట్లను కూడా జారీ చేసి, ‘ఒస్మానియా సిక్కా రూపాయి’ పేరుతో చెలామణిలోకి తెచ్చింది. సొంత నాణేలు, కాగితపు నోట్లు రెండింటినీ జారీ చేసి, ప్రత్యేక కరెన్సీ వ్యవస్థను కొనసాగించిన భారతీయ సంస్థానాల్లో హైదరాబాద్ ప్రత్యేకమైనది. బ్రిటిష్ ఇండియా కరెన్సీ దేశమంతటా చెలామణిలో ఉన్న కాలంలోనూ, హైదరాబాద్ సంస్థానం తన ప్రత్యేక కరెన్సీ వ్యవస్థను కొనసాగించడం నిజాం రాజ్యపు ఆర్థిక స్వతంత్రతకు తార్కాణం.

తుగ్లక్ ‘టోకెన్ కరెన్సీ’ ప్రయోగం, షేర్ షా సూరి ‘రూపయా
లోహ నాణేల వ్యవస్థ పరిఢవిల్లుతున్న 14వ శతాబ్దంలోనే, ఢిల్లీ సుల్తనేట్ పాలనలో భారత కరెన్సీ చరిత్రలో ఒక సాహసోపేతమైన ప్రయోగం జరిగింది. చైనాలో అప్పటికే అభివృద్ధి చెందిన ద్రవ్య విధానం స్ఫూర్తితో, మహమ్మద్ బిన్ తుగ్లక్ 1329-1330 మధ్య కాలంలో రాగి, ఇత్తడి లోహాలతో తయారైన నాణేలకు బంగారం, వెండి నాణేలతో సమమైన విలువను ఆపాదిస్తూ భారతదేశంలో తొలిసారి ‘టోకెన్ కరెన్సీ’ విధానాన్ని ప్రవేశపెట్టాడు. నాణెం తయారీ తయారీకి ఉపయోగించిన పదార్థం విలువతో సంబంధం లేకుండా, ప్రభుత్వం దానికి నిర్ణయించిన విలువను ఆపాదించే ద్రవ్య విధానమే ‘టోకెన్ కరెన్సీ అయితే ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో, ప్రజలు సొంతంగా నాణేలు తయారు చేయడం మొదలుపెట్టారు. భారీగా నకిలీ నాణేలు మార్కెట్లోకి రావడంతో ఈ ప్రయోగం విఫలమైంది; తుగ్లక్ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, చివరకు నిజమైనవీ, నకిలీవీ రెండు రకాల నాణేలనూ, వాటికి సమానమైన విలువగల బంగారు, వెండి నాణేలను ఇచ్చి ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ‘తుగ్లక్’ అనే పదం ఆ తర్వాతి కాలంలో పరిపాలనలో అనాలోచిత, విఫలమైన నిర్ణయాలకు మారుపేరుగా ప్రాచుర్యం పొందింది. ఈ కరెన్సీ ప్రయోగం అలాంటి అనేక వివాదాస్పద నిర్ణయాల్లో ఒకటి. 16వ శతాబ్దంలో సూర్ సామ్రాజ్య స్థాపకుడు షేర్ షా సూరి నాణేల తయారీలో కచ్చితమైన కొలమానాలను, కట్టుదిట్టమైన నియంత్రణను ప్రవేశపెట్టాడు. 178 ధాన్యపు గింజల బరువు, అంటే సుమారు 11.53 గ్రాముల, వెండి నాణేన్ని ముద్రించాడు. సంస్కృత పదం ‘రూప్య’ (మలచిన వెండి) నుంచి వచ్చిన, అప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాడుకలో ఉన్న, ‘రూపయా’ అనే పేరుతో ఆ వెండి నాణెం ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో, ఈ పేరు భారతదేశపు ఎల్లలు NG దాటి. స్వల్ప తేడాలతో నేపాల్, శ్రీలంక, మారిషస్, సీషెల్స్, ఇండోనేషియా, మాల్దీవులు వంటి దేశాల్లోనూ జాతీయ కరెన్సీగా ప్రాచుర్యం పొందింది. తర్వాతి కాలంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ వ్యవస్థను మరింత క్రమబద్దీకరించగా, బ్రిటిష్ ప్రభుత్వం కూడా రూపాయిని ప్రామాణిక కరెన్సీ గా కొనసాగించింది. బ్రిటిష్ హయాంలో నాణేల ప్రామాణీకరణ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినా, అప్పటికే వివిధ ప్రెసిడెన్సీలు, సంస్థానాలు వేర్వేరు నాణేలను చెలామణి చేయడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దానికి తోడు లావాదేవీల పరిమాణం పెరిగిన కొద్దీ, పెద్ద సంఖ్యలో నాణేలను తరలించడం, లెక్కించడం, భద్రపరచడం సవాలుగా మారింది. ఆ నేపథ్యంలో, చైనా, స్వీడన్లలో అప్పటికే వాడుకలో ఉన్న కాగితపు నోట్ల విధానం 18వ శతాబ్దం చివర్లో భారత్ లోనూ ప్రవేశించింది. ‘బ్యాంక్ ఆఫ్ హిందూస్తాన్’, ‘బ్యాంక్ ఆఫ్ బెంగాల్ వంటి తొలితరం బ్యాంకులు స్వంతంగా జారీ చేసిన ప్రామిసరీ నోట్లు, నిర్ణీత భౌగోళిక పరిధిలో కరెన్సీ నోట్లుగా చెలామణి అయ్యాయి. ఈ వికేంద్రీకృత విధానానికి స్వస్తి పలుకుతూ 1861లో బ్రిటిష్ ప్రభుత్వం ‘పేపర్ కరెన్సీ’ చట్టాన్ని తెచ్చి, నోట్ల జారీపై గుత్తాధిపత్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. విక్టోరియా మహారాణి బొమ్మతో రూపొందిన ఈ ప్రభుత్వ నోట్లు, క్రమంగా దేశవ్యాప్తంగా ఏకీకృత కాగితపు కరెన్సీ వ్యవస్థకు పునాది వేశాయి. కాగితపు నోట్ల వాడకం పెరిగినా, వాటి ముద్రణ మాత్రం విదేశాల్లోనే జరిగేది. ఈ లోటును సరిదిద్దుతూ 1928లో మహారాష్ట్రలోని నాసిక్ కాగితపు కరెన్సీ నోట్ల ముద్రణ మొదలైంది. భారత ద్రవ్య వ్యవస్థ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తెస్తూ ఏర్పడిన ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ తొలిసారిగా 1938లో నోట్లు జారీ చేసింది. బ్రిటిష్ చక్రవర్తి కింగ్ జార్జ్ VI చిత్రంతో ముద్రితమైన ఈ శ్రేణిలో, ఆర్బీఐ ఇప్పటివరకూ విడుదల చేసిన అత్యధిక విలువైన రూ.10,000 నోటు కూడా ఒకటి.

1946లో మరో కీలక పరిణామం
భారతదేశం మొట్టమొదటిసారిగా పెద్దనోట్ల రద్దు రూపంలో నల్లధనాన్ని అరికట్టే దృఢ సంకల్పాన్ని చూచింది. స్వాతంత్ర్యానంతరం కూడా మన కరెన్సీ పరిణామం చెందుతూనే ఉంది. 1949లో విడుదలైన రూపాయి నోటు స్వతంత్ర భారత తొలి కరెన్సీ నోటుగా చరిత్రకెక్కింది. అంతకుముందు నోట్లపై ఉన్న బ్రిటిష్ రాజు చిత్రం స్థానంలో, సారనాథ్ లోని అశోక సింహాల రాజముద్రను పొందుపరిచారు. స్వతంత్ర భారత సార్వభౌమత్వానికి ద్రవ్య రూపంలో లభించిన తొలి, గొప్ప గుర్తింపు ఇదే. 1957లో అప్పటివరకూ అమల్లో ఉన్న అణా, బేడ, కాని, కాసు వంటి విభజన విధానానికి స్వస్తి పలికారు. రూపాయిని వంద పైసలుగా విభజించే దశాంశ పద్ధతిని అమలు చేసి, ఆర్ధిక లావాదేవీలను మరింత సులభతరం చేశారు.
ఈ నిరంతర పరిణామం దేశీయ సరిహద్దులకే పరిమితం కాలేదు. దాదాపు శతాబ్దం పాటు, చమురు సంపద ప్రాధాన్యం పెరగకముందు, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ తో పాటు నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పిలిచే ట్రూషియల్ రాజ్యాలలో భారతీయ రూపాయి విస్తృతంగా చెలామణిలో ఉండేది. అయితే ఈ ప్రాంతాల నుంచి అక్రమంగా దిగుమతయ్యే బంగారం భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచింది. దాంతో 1959లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గల్ఫ్ ప్రాంతంలో చెలామణి కోసం ప్రత్యేకంగా ఎరుపు, నారింజ రంగుల్లో ‘గల్ఫ్ రూపాయి’ నోట్లను జారీ చేసింది. బంగారం స్మగ్లింగ్‌తో ముడిపడిన ద్రవ్య ప్రవాహాలను నియంత్రించడం, భారత రూపాయి చెలామణిని దేశీయ వ్యవస్థకే పరిమితం చేయడం దీని ప్రధాన ఉద్దేశాలు. అదే పంథాలో, దేశంలో పేరుకుపోతున్న నల్లధనం, పన్ను ఎగవేత, అక్రమ లావాదేవీలను అరికట్టే ఉద్దేశంతో 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రెండవసారి పెద్ద నోట్లను రద్దు చేసింది. తరువాత కూడా సంస్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి.

మహాత్మా గాంధీ శ్రేణి, సాంస్కృతిక ప్రతీకలు
నకిలీ నోట్లను అరికట్టేందుకు, వాటి గుర్తింపును మరింత సులభతరం చేసేందుకు 1996లో రిజర్వ్ బ్యాంక్
‘మహాత్మా గాంధీ శ్రేణీ’ నోట్లను ప్రవేశపెట్టింది. భద్రతా దారం, ల్యాటెంట్ ఇమేజ్(వాలుగా చూసినప్పుడు మాత్రమే కనిపించే రహస్య చిత్రం), సూక్ష్మ ముద్రణ, దృష్టిలోపమున్న వారి కోసం ఉబ్బెత్తు ముద్రణ వంటి భద్రతా లక్షణాలను అందులో పొందుపరిచారు. మరో రెండు దశాబ్దాల తరువాత, 2016లో ప్రభుత్వం మూడవసారి పెద్ద నోట్లను రద్దు చేస్తూ దేశ ఆర్థిక చరిత్రలో మరో కీలక కరెన్సీ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఆర్థిక సంస్కరణలతో పాటు, కరెన్సీ నోట్లను సాంస్కృతిక వారధులుగా, చారిత్రక ఆనవాళ్లుగా కూడా ప్రభుత్వం వినియోగిస్తోంది. పాత నోట్లలో వ్యవసాయ, పారిశ్రామిక పురోగతికి ప్రతీకలుగా రైతునాగలి చిహ్నం, భారీ జలవిద్యుత్ డ్యామ్‌లు, అంతరిక్ష రంగంలో విజయానికి గుర్తుగా భారతదేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్ట వంటి చిహ్నాలు చోటుచేసుకున్నాయి. నూతన శ్రేణి నోట్లలో కోణార్క్ సూర్య దేవాలయపు రాతి చక్రం భారతీయ శిల్పకళా వైభవాన్ని, కాలగణనకు సంబంధించిన ప్రాచీన విజ్ఞానాన్ని గుర్తుచేస్తుంది. ఎల్లోరా గుహలు హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాల సహజీవనానికి ప్రతీకగా నిలుస్తాయి. హంపిలోని రాతి రథం విజయనగర సామ్రాజ్యపు శిల్పకళా వైభవానికి నిదర్శనం. గుజరాత్‌లోని ‘రాణి కీ వావ్’ అలనాటి నిర్మాణ చాతుర్యానికి మచ్చుతునక. అశోకుని సాంచి స్థూపం బౌద్ధ వారసత్వానికి ప్రతీక కాగా, ఢిల్లీ ఎర్రకోట జాతీయ సార్వభౌమత్వానికి సంకేతంగా నిలుస్తుంది. అలాగే మంగళ్యాన్ మిషన్ చిత్రం అతి తక్కువ వ్యయంతో అంగారక గ్రహాన్ని చేరుకున్న ఆధునిక భారత అంతరిక్ష విజయగాథను చాటుతుంది.
ఇదే విధంగా నాణేలు కూడా కాలానుగుణంగా మారుతున్న భారతదేశ విలువలకు, విజయాలకు ప్రతీకలుగా నిలిచాయి. స్వాతంత్ర్యానంతరం వాటి ముందు వైపున అశోక సింహాల రాజముద్ర, ‘సత్యమేవ జయతే’, ‘భారత్-ఇండియా’ వంటి చిహ్నాలు జాతీయ గుర్తింపును ప్రతిబింబిస్తే, వెనుక వైపు వివిధ సందర్భాలను, సాధించిన ప్రగతిని, ప్రముఖ వ్యక్తులను, సంస్థలను స్మరణకు తెచ్చే చిహ్నాలు చోటుచేసుకున్నాయి. సమాచార సాంకేతికత, పార్లమెంటు, విశ్వవిద్యాలయాల శతాబ్ది, ప్రముఖుల జనన, మరణాలు వంటి అనేక అంశాలతో స్మారక నాణేలు విడుదలయ్యాయి. ఇలా నోట్లతో పాటు నాణేలు కూడా మన దేశ చరిత్ర, సంస్కృతి, విజ్ఞానం, జాతీయ భావనలను ప్రజలకు చేరవేసే చిన్న లోహపు దస్తావేజులుగా పరిణతి చెందాయి.
కాగితపు నోట్ల ప్రవేశం, ఆర్బీఐ ఆవిర్భావం
కరెన్సీకి గుర్తింపునిచ్చే మరో ముఖ్యమైన పరిణామం 2010లో జరిగింది. డి. ఉదయకుమార్ రూపొందించిన దేవనాగరి ఆర్, రోమన్ ‘R’ల సమ్మేళనమైన రూపాయి చిహ్నానికి అధికారిక గుర్తింపు లభించింది. ఒక చిహ్నం ద్వారా భారతీయతను, అంతర్జాతీయ వినియోగాన్ని మిళితం చేసిన ఈ రూపకల్పన, రూపాయి ప్రత్యేకమైన గుర్తింపును సంతరించుకోవడంలో దోహదపడింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మిగిలిన అన్ని నోట్లనూ రిజర్వ్ బ్యాంకు జారీ చేయగా, రూ.1 నోటును మాత్రం భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. చారిత్రకంగా రూ.1 నోటును కూడా చట్టం ‘రూపాయి నాణెం’గానే పరిగణించడం, నాణేల నిర్వహణ పట్ల ప్రభుత్వమే బాధ్యత వహించడం ఇందుకు కారణాలు. అందుకే దానిపై ఆర్ బీఐ గవర్నర్ సంతకం కాకుండా కేంద్ర ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది.

ఆర్బిఐ తాజా గణాంకాల ప్రకారం, 2026 ລ້ 31 నాటికి దేశంలో రూ.41.23 లక్షల కోట్ల విలువ గల నోట్లు చెలామణిలో ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో నోట్లను ముద్రించడం కోసం విస్తృతమైన వ్యవస్థ ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్‌లోని దేవాస్, కర్ణాటకలోని మైసూరు, పశ్చిమ బెంగాల్‌లోని సాల్బోనిలలో నాలుగు కరెన్సీ ముద్రణా కేంద్రాలు పనిచేస్తున్నాయి. నాణేలను ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడాలోని నాలుగు ప్రభుత్వ టంకశాలల్లో ముద్రిస్తారు. ఇంతటి సుదీర్ఘమైన, ఆసక్తికరమైన ద్రవ్య చరిత్రను కేవలం పుస్తకాల్లోనే కాకుండా ప్రదర్శనల్లోనూ చూడవచ్చు. ఆర్బీఐ నిర్వహిస్తున్న ముంబై మానిటరీ మ్యూజియంలో భారత నాణేలు, కాగితపు కరెన్సీ, బంగారు కడ్డీలు, పాతకాలపు ఆర్థిక సాధనాలను ఒకేచోట చూడవచ్చు. ఇక భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తే, భారత కరెన్సీ మరో కొత్త రూపాన్ని ధరించబోతోంది. ఇప్పటివరకు మన కరెన్సీ నోట్లు ప్రధానంగా 100 శాతం పత్తితో తయారైన ప్రత్యేక కరెన్సీ పేపర్‌పై ముద్రించబడుతున్నాయి. నోట్ల మన్నికను పెంచడం, తేమ, మురికి, రోజువారీ వినియోగం వల్ల కలిగే అరుగుదలను తగ్గించడం వంటి లక్ష్యాలతో, ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లు, లోహపు నాణేలకు తోడుగా, ప్రయోగాత్మకంగా రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మరోవైపు, కరెన్సీ ప్రయాణం డిజిటల్ తెర వైపుకూ సాగుతోంది. యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపు వ్యవస్థలతో పాటు, ఆర్బీఐ ప్రవేశపెట్టిన డిజిటల్ రూపీ లేదా సీబీడీసీ రూపంలో డబ్బు ఇప్పుడు భౌతిక రూపం లేకుండానే చెలామణి అవుతోంది. ప్రస్తుతానికి నాణేలు, కాగితం, ప్లాస్టిక్ నోట్లు, డిజిటల్ రూపీ.. ఇవన్నీ సమాంతరంగా కొనసాగుతాయి. అయితే, కరెన్సీ మాత్రం ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరో పరివర్తన కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. నోట్లపై, నాణేలపై కనిపించే చిహ్నాలు, సహస్రాబ్దాలుగా నాణేల్లో, శతాబ్దాలుగా నోట్లలో చోటుచేసుకుంటున్న మార్పులు ‘నుమిస్మాటిజం’ (నాణేలు, నోట్లు తదితర ద్రవ్య రూపాల అధ్యయనం) మీద ఆసక్తి ఉన్న వారికి ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తాయి. మనం కేవలం రోజువారీ అవసరాల దృష్టితో చూసే ప్రతి నోటు, నాణెం వెనుక వేల ఏళ్ల చరిత్ర దాగి ఉంది. ఒక జాతి ఆత్మను తనలో ఇముడ్చుకుంటూ, నిరంతరం పరిణామం చెందుతున్న దాని ప్రయాణాన్ని గమనిస్తే, రూపాయి మనల్ని ఆప్యాయంగా పలకరిస్తున్న అనుభూతి కలుగుతుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :