GST 2.0: మన దేశంలో పన్నుల విధానం ఎప్పుడూ ఒక ప్రధాన చర్చనీయాంశంగానే ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే పన్నులే ముఖ్యమైన మార్గం. అయితే, ఆ పన్నులను ఎలా వసూలు చేయాలనేది చాలా కీలకం. పన్నుల భారం ఒకరిపైనే ఎక్కువగా పడితే, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా, వ్యాపారాలు సరిగా సాగక, పెట్టుబడులు తగ్గిపోతాయి.ముఖ్యంగా పరోక్ష పన్నులు ప్రజలకు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఎందుకంటే, ఈ పన్నులను ప్రజలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించరు. బదులుగా, మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేదా ఏదైనా సేవ తీసుకున్నప్పుడు దాని ధరలోనే ఈ పన్నులు కలిసి ఉంటాయి. ఉదా: ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నప్పుడు దాని ధరలోనే జీఎస్టీ ఉంటుంది. ఇలాంటి పన్నులే మన ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.
Read Also: Nutrition is Life: పోషకాహారమే జీవనాధారం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ(GST 2.0) కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో భారత పరోక్ష పన్నుల విధానంలో ఒక కొత్త శకం మొదలైంది. దీనిని ‘జీఎస్టీ 2.0’ అని పిలుస్తున్నారు. ఇది 2025 సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చింది. 2017లో వచ్చినజీఎస్టీ తర్వాత ఇంత పెద్ద పన్నుల మార్పు ఇదే. ఈ కొత్త విధానం ఒకే పన్ను, ఒకే మార్కెట్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అలాగే, పన్ను వ్యవస్థను మరింత సులభతరం చేస్తుంది. ఈ విధానంలో ఇదివరకు ఉన్న నాలుగు పన్ను రేట్లైన 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంలను తొలగించి, వాటి స్థానంలో నిత్యావసర వస్తువులపై 5 శాతం, ప్రామాణిక వస్తువులు, సేవలపై 18 శాతం పన్నులుంటాయి.

అయితే, సిన్ లేదా విలాస వస్తువులపై ఏకంగా 40 శాతం పన్ను విధించారు. ‘సిన్’ వస్తువులు అంటే పొగాకు, జూదం, బెట్టింగ్, శీతల పానీయాలు, అధిక కొవ్వు, చక్కెర ఉన్న ఆహార పదార్థాలు వంటివి.అదేవిధంగా, పెద్ద కార్లు, ఖరీదైన మోటార్ సైకిళ్లు, వ్యక్తిగత విమానాలు వంటి విలాస వస్తువులపై కూడా ఇదే పన్ను వర్తిస్తుంది. ఈ మార్పుల వల్ల పన్ను రేట్లు హేతుబద్ధంగా మారి, పన్నుల విధానంలో గందరగోళం తగ్గుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి, వినియోగాన్ని పెంచుతుందని, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.జీఎస్టీని తీసుకురావాలనే ఆలోచన 2000వ సంవత్సరం చివరిలో మొదలైంది. జీఎస్టీ రాకముందు మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రకాల పన్నులను వసూలు చేసేవి. దీనివల్ల పన్నుల వ్యవస్థ చాలా గందరగోళంగా ఉండేది. ఈ గందరగోళాన్ని తొలగించడానికి జీఎస్టీని ప్రవేశపెట్టారు. ఈ విధానం దాదాపు 17 రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులను, ఇంకా 13 రకాల సెస్సులను కలిపి ఒకే పన్నుగా మార్చింది.
Read Also: Goods Sales:మార్కెట్ మాయలోజనం విలవిల
ఈ పన్నులలో వ్యాట్, సేవా పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్ వంటివి ఉన్నాయి. అయితే, జీఎస్టీని(GST 2.0) అమలు చేయడం అంత సులభం కాదు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆదాయ పంపకాలపై చాలా విభేదాలు వచ్చాయి. రాజకీయంగా, చట్టపరంగా ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ, సంవత్సరాల తరబడి చర్చలు జరిపిన తర్వాత, చివరకు 2017 జూలై 1న అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలులోకి రావడానికి భారతదేశ రాజ్యాంగానికి 101వ సవరణ చేశారు. ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తువులు, సేవలపై పన్నులు విధించే అధికారం వచ్చింది. దీనివల్ల దేశమంతా ఒకే రకమైన పన్ను వ్యవస్థను తీసుకురావడం సాధ్యమైంది.జీఎస్టీ అనేది వస్తువులు, సేవల సరఫరాపై విధించే పన్ను. ఇదివరకు ఉన్న పన్నుల విధానంలో వస్తువులను ఎక్కడ తయారు చేస్తే అక్కడ పన్ను వసూలు చేసేవారు. కానీ, జీఎస్టీలో ఆ వస్తువులను ఎక్కడ అమ్ముతారో/ ఎక్కడ వినియోగిస్తారో, ఆ ప్రాంతానికి పన్ను ఆదాయం వెళ్తుంది. ఉదా: ఒక వస్తువును తెలంగాణలో తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో అమ్మితే ఆ పన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెళ్తుంది. దీనివల్ల పన్ను భారం పూర్తిగా వస్తువును కొనుగోలు చేసే చివరి వినియోగదారుడిపై పడుతుంది.
ఒకే దేశం.. ఒకే పన్ను
జీఎస్టీని ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన లక్ష్యం దేశంలో ఉన్న అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్ను విధా విధానంగా మార్చడం. దీనివల్ల భారతదేశం ఒకే జాతీయ మార్కెట్గా మారుతుంది.2017 జీఎస్టీ విధానం నిర్మాణం లోపాలు ప్రారంభంలో 2017లో వచ్చిన జీఎస్టీ విధానంలో చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిలోని పన్ను రేట్లు చాలా క్లిష్టంగా ఉండేవి. ఈ విధానంలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అనే నాలుగు వేర్వేరు పన్ను రేట్లు ఉండేవి. ఈ పన్ను రేట్లను నిత్యావసర వస్తువుల నుండి విలాస వస్తువుల వరకు విభజించారు. అయితే, వస్తువులను ఏ రేటు కిందకు తీసుకు రావాలనేది చాలా గందరగోళంగా మారింది. దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి.
నిర్మాణ లోపాలు బహుళ పన్ను రేట్లు,అసంపూర్ణ అమలు
2017లో వచ్చిన జీఎస్టీలో ప్రధానమైన లోపం దాని నిర్మాణంలో ఉంది. ఇందులో ఉన్న బహుళ పన్ను రేట్ల విధానం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) పన్ను వ్యవస్థను సరళీకృతం చేయాలనే అసలు లక్ష్యానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఈ నాలుగు రేట్ల వల్ల వ్యాపారులు, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారులకు తమ ఉత్పత్తులను ఏ రేటు కింద వర్గీకరించాలో తెలియక చాలా ఇబ్బందులు పడ్డారు. అన్ని పరోక్ష పన్నులను ఒకే విధానం కిందకు తీసుకురావాలని అనుకున్నప్పటికీ, పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం, విద్యుత్ వంటి ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమైన వస్తువులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించారు. ఈ వస్తువులపై ఇప్పటికీ పాత పన్నుల విధానమే కొనసాగుతోంది. దీనివల్ల, జీఎస్టీ తొలగించాలనుకున్న పన్నుల క్యాస్కేడింగ్ ప్రభావం ఈ వస్తువులపై అలాగే ఉండిపోయింది.
Read Also: Millets for Health:ఆరోగ్య సిరికి’నవ రత్నాలు
అమలులో ఎదురైన సమస్యలు
2017లో జీఎస్టీని ఆదరాబాదరాగా అమలు చేయడం వల్ల చాలా సమస్యలు తలెత్తాయి. జీఎస్టీకి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ అయిన జీఎస్టీ(GST 2.0) నెట్వర్క్ సరిగ్గా పనిచేయలేదు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో చాలా ఇబ్బందులు పడ్డారు. దీని ఫలితంగా చాలా మంది గడువు తేదీలను కూడా దాటిపోయారు.కొవిడ్ 19 మహమ్మారి తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం ఇవ్వడంలో జాప్యం జరిగింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి. ఇది కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య నమ్మకాన్ని దెబ్బతీసింది. అలాగే, జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఈ విషయంపై చాలా వాదోపవాదాలు జరిగాయి. ఇంకో సమస్య ఏంటంటే, జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయాల్సిన జీఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ స్థాపనలో చాలా ఆలస్యం జరిగింది. దీనివల్ల వ్యాపారాలకు సంబంధించిన పన్ను వివాదాలు పరిష్కారం కాకుండా పేరుకుపోయాయి. ఈ అనిశ్చితి వ్యాపార వర్గాల్లో గందరగోళాన్ని సృష్టించింది. దీంతో వారు ఆర్ధికంగా,చట్టపరంగా ఇబ్బందులు పడ్డారు.
జీఎస్టీ 2.0 కి నాంది
పాత జీఎస్టీలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘జీఎస్టీ 2.0’ని తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం పాత వ్యవస్థలోని ప్రధాన లోపాలను సరిదిద్దడానికి, పన్నుల వ్యవస్థను మరింత సరళంగా, పారదర్శకంగా మార్చడానికి రూపొందించబడింది.

సామాన్యుడికి లాభాలు
జీఎస్టీ 2.0 వల్ల సామాన్య ప్రజలకు అనేక లాభాలు ఉన్నాయి. ఈ కొత్త పన్నుల విధానం వారి జేబులకు ఊరటనిస్తుంది. అలాగే వారి జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ సంస్కరణల వల్ల వినియోగదారులకు నేరుగా ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. పన్ను రేట్లు తగ్గడం వల్ల నిత్యావసరాలు, గృహోపకరణాలు గణనీయంగా చౌకగా లభిస్తాయి. దీనివల్ల సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజలు ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తే, అది మార్కెట్లో డిమాండ్ను పెంచుతుంది. ఇది చివరికి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. జీఎస్టీ 2.0లో వచ్చిన మార్పుల వల్ల సబ్బులు, షాంపూలు, టూత్పేస్టులు, హెయిర్ ఆయిల్స్ వంటి మనం రోజూ వాడే వస్తువులు చాలా చౌకగా మారతాయి. ఎందుకంటే, వీటిపై ఇదివరకు ఉన్న 12-18 శాతం పన్నును ఇప్పుడు 5 శాతానికి తగ్గించారు.
ఆటోమొబైల్, తయారీ రంగం
ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ 2.0(GST 2.0) సంస్కరణలు ఒక స్పష్టమైన విధానాన్ని చూపుతున్నాయి. లగ్జరీ కార్లు, దిగుమతి చేసుకున్న వాహనాలపై పన్ను భారం పెంచుతూనే సామాన్యులు వాడే వాహనాలను, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. చిన్న కార్లు, 350 సీసీ వరకు ఉన్న టూ వీలర్లు, వాణిజ్య వాహనాలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. తగ్గించారు. దీనివల్ల దీనివల్ల మధ్య తరగతి కుటుంబాలకు, మొదటిసారిగా వాహనం కొనేవారికి ఈ వాహనాలు అందుబాటు ధరల్లో లభిస్తాయి. ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో డిమాండ్ బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దసరా పండుగ సీజన్ కు ఈ మార్పులు అమలులోకి రావడంతో వాహన తయారీ సంస్థలు, ఎలక్ట్రానిక్ కంపెనీలు అమ్మకాలకు సిద్ధమయ్యాయి.అదే సమయంలో 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం లేదా 4000 ఎంఎం పొడవు ఉన్న పెద్ద లగ్జరీ వాహనాలపై కొత్తగా 40 శాతం పన్ను విధించారు. ఈ పెంపు వల్ల ఈ వాహనాలు మరింత ఖరీదైనవిగా మారతాయి.
సేవా రంగం జీఎస్టీ 2.0తో కొత్త ఊపు
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం చాలా ముఖ్యమైనది. జీఎస్టీ 2.0 ఈ రంగానికి కొత్త శక్తిని ఇవ్వనుంది. పాత జీఎస్టీలో ఉన్న సమస్యలను సరిచేసి, పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేయడం వల్ల సేవా రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. పాత విధానంలో కొన్ని సేవలపై 18 శాతం పన్ను ఉండేది. కానీ కొత్త జీఎస్టీలో పన్ను రేట్లు తగ్గించడం వల్ల కొన్ని సేవల ధరలు తగ్గుతాయి. ఉదాహరణకు హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా వంటి సేవలు ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తాయి. దీనివల్ల ప్రజలు ఈ సేవలను ఎక్కువగా ఉపయోగిస్తారు. తద్వారా సేవా రంగంలో వ్యాపారాల ఆదాయం పెరుగుతుంది. ఈ మార్పులు మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీని కూడా పెంచుతాయి. చివరికి వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి.
Read Also: Adulteration of food:గాలి పీల్చినా, నీరు తాగినా.. కడుపు కోతే
ఫైనాన్షియల్ సర్వీసెస్,ఇన్సూరెన్స్
జీఎస్టీ 2.0(GST 2.0) లో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు.. ఆర్థిక సేవలు, బీమా రంగానికి సంబంధించింది. కొత్త విధానం ప్రకారం వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై ఇంతకు ముందు ఉన్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించారు. ఈ మార్పు ప్రజలకు పెద్ద ఊరట. ఎందుకంటే, ఇప్పుడు వారు తక్కువ ఖర్చుతో బీమా పాలసీలు తీసుకోవచ్చు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుంది. అలాగే, ఎక్కువ మంది బీమా పాలసీలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఆర్థికంగా ప్రజలకు మరింత భద్రత లభిస్తుంది.
నిర్మాణం, రియల్ ఎస్టేట్ జీఎస్టీ సంస్కరణల ప్రభావం
జీఎస్టీ సంస్కరణల వల్ల నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాలు గణనీయమైన ప్రోత్సాహాన్నిఅందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రంగాలు ఒక శక్తివంతమైన ఆర్థిక ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. సిమెంట్ ధరపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం ఈ పరిశ్రమ చాలా కాలంగా కోరుకుంటున్న సంస్కరణ. ఈ పన్ను తగ్గింపు వల్ల ప్రతి బస్తా ధర రూ.25 నుంచి రూ.30 వరకు తగ్గుతుందని అంచనా. అదనంగా, ఇసుక, సున్నపు ఇటుకలు, పాలరాయి, గ్రానైట్ వంటి ఇతర ముఖ్య నిర్మాణ వస్తువులపై పన్నులు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
ఈ చర్య వల్ల నిర్మాణ ఖర్చులు మరింత తగ్గుతాయి. నిర్మాణ ఖర్చులు తగ్గడం వల్ల ప్రభుత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలకు నేరుగా మద్దతు లభిస్తుంది. అలాగే, సిమెంట్ మార్కెట్లో గణనీయమైన వాటాను కలిగి ఉన్న గృహ నిర్మాణం మరింత అందుబాటులోకి వస్తుంది. ఈ చర్య వల్ల డిమాండ్పెరుగుతుందని, కార్మిక ఆధారిత నిర్మాణ రంగంలో కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని, తద్వారా ఆర్థిక వ్యవస్థపై విసృతమైన సానుకూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఈ చర్య వల్ల సిమెంట్ కంపెనీలు తాత్కాలికంగా లాభాలను తగ్గించుకోవచ్చు. అయితే, జేఎం ఫైనాన్షియల్ నివేదిక సూచించిన ప్రకారం, ఈ చర్య వల్ల పరిశ్రమ అధిక అమ్మకాల ద్వారా మధ్య నుండి దీర్ఘకాలికంగా నికర ఆదాయాలు, లాభాలను పెంచుకోవడానికి అనుకూలమైన స్థితిలో ఉంటుంది. బలమైన గ్రామీణ నెట్వర్లు ఉన్న కంపెనీలు దీనివల్ల ప్రధానంగా లబ్ధి పొందుతాయి.

ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ప్రభావం
ఎలక్ట్రానిక్స్ పై పన్ను రేట్లు, వస్తు సేవల పన్ను ఎలక్ట్రానిక్స్ ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. జీఎస్టీ 2.0లో(GST 2.0) తగ్గించబడ్డాయి. దీంతో చాలా వస్తువులు తక్కువ పన్ను పరిధిలోకి వచ్చాయి. 32 అంగుళాల కంటే పెద్ద టీవీలు, ఏసీలు, డిష్వాషర్లపై గతంలో ఉన్న 28 శాతం పన్ను 18 శాతానికి తగ్గింది. ఈ మార్పు టీవీల అమ్మకాలను పెంచింది. అలాగే చాలా కాలంగా ఏసీలపై అధిక పన్ను గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు ఈ రేట్ల తగ్గింపుతో పరిష్కారమయ్యాయి. ముఖ్యంగా నగరాల్లో, మరింత సరసమైన ధరలో ఏసీల అమ్మకాలు పెరిగాయి. డిష్వాషర్లు కూడా పట్టణవాసులకు దగ్గరవుతాయి. ఈ పన్ను తగ్గింపు గృహ పనులను ఆధునీకరించడానికి, చేతి పని భారాన్ని తగ్గించడానికి ఒక అవకాశం. తగ్గిన పన్ను వల్ల ఎక్కువ మంది ప్రజలు ప్రాథమిక గృహోపకరణాలను కొనుగోలు చేయగలుగుతారు. పట్టణీకరణ, పెరుగుతున్న ప్రజల ఆదాయంతో ఈ పన్ను రేట్ల మార్పు వలన ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ బలోపేతం అవుతుంది.
వస్త్ర పరిశ్రమ
జీఎస్టీ 2.0లో వచ్చిన మార్పుల వల్ల వస్త్ర పరిశ్రమకు పెద్ద ఊరట లభించింది. ఇప్పుడు, మానవ నిర్మిత ఫైబర్స్, నూలుపై జీఎస్టీని ఒకే విధంగా 5 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం ‘విలోమ సుంకం నిర్మాణం’ అనే సమస్యను పరిష్కరించింది. ఇంతకుముందు, వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే ముడి సరుకులపై పన్ను ఎక్కువగా ఉండేది.
వ్యవసాయ రంగంపై ప్రభావం
ట్రాక్టర్, హార్వెస్టర్, రోటేవేటర్ వంటి వివిధ రకాల వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా రైతులకు ఇది ఎంతో ప్రయోజనం. ఈ రేట్ల తగ్గింపుతో వ్యవసాయ ఖర్చు తగ్గుతుంది.జీఎస్టీ 2.0(GST 2.0) అమలులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం, ఆర్థిక నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. పన్ను రేట్లను తగ్గించడం వల్ల వస్తువుల ధరలు తగ్గి, ప్రజలు ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తారు. దీనివల్ల మార్కెట్లో వినియోగం పెరుగుతుందని, తద్వారా పన్ను ఆదాయం పెరిగి, మొదట సంభవించే ఆదాయ నష్టాన్ని భర్తీ చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. రెండవది సిగార్లు, ఖరీదైన కార్లు వంటి విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై కొత్తగా 40 శాతం పన్ను స్లాబు ప్రవేశపెట్టడం ద్వారా ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త జీఎస్టీ రేట్ల వల్ల వ్యాపారాలు ఎదుర్కొనే సమస్యలను తగ్గించడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
వ్యాపారులు తమ పాత స్టాక్పై ఉన్న ఎంఆర్పీ (గరిష్ఠ చిల్లర ధర)ను మార్చుకోవడానికి 2025 డిసెంబర్ 31 వరకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల వ్యాపారులకు, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు చాలా ఊరట లభిస్తుంది. అలాగే, పన్నుల వివాదాలను త్వరగా పరిష్కరించడానికి జీఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ను పూర్తి స్థాయిలో అమలు చేయడం చాలా అవసరం.కొత్త జీఎస్టీ రేట్ల ప్రభావం అన్ని రాష్ట్రాలపై ఒకేలా ఉండదు. పన్ను ఆదాయంపై ఎక్కువగా ఆధారపడిన పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు, అలాగే అధిక వినియోగం ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనివల్ల ఈ రాష్ట్రాలు తమ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడంలో ఇబ్బందులు పడవచ్చు. పన్ను తగ్గింపు వల్ల వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తిగా అందేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. దీనికోసం మార్కెట్పై నిఘా పెంచాలి. ఆదాయ నష్టం గురించి ఆందోళన పడుతున్న రాష్ట్రాలకు ధైర్యం. చెప్పడానికి, కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నష్టపరిహార పథకంను తీసుకురావాలి. అప్పుడే రాష్ట్రాలు ఆర్థికంగా సురక్షితంగా ఉంటాయి.

Read Also: Healthy Fruits: ఒక్క పండు చాలు.. ఆరోగ్యానికి మేలు
భవిష్యత్తుపై కొత్త ఆశ
జీఎస్టీ 2.0 అనేది కేవలం పన్నుల రేట్లను మార్చడం మాత్రమే కాదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త దారి చూపిస్తుంది. ఈ విధానం వల్ల సామాన్య ప్రజల జేబులకు చాలా ఊరట లభిస్తుంది. పన్నులు తగ్గడం వల్లప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తయారీ, వ్యవసాయ, ఆరోగ్య రంగాలకు ఈ మార్పులు పెద్దగా సహాయపడతాయని అంచనా. ఈ సంస్కరణలు విజయవంతం కావాలంటే మూడు విషయాలపై దృష్టి పెట్టాలి. అవి: ఒకటి: సామాన్య ప్రజలకు ప్రయోజనాలు పూర్తిగా అందేలా చూడాలి. రెండు: వ్యాపారాలకు ఎదురయ్యే సాంకేతిక, నిర్వహణ సమస్యలను పరిష్కరించాలి, మూడు: రాష్ట్రాలకు వచ్చే ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలి. ఈ వాస్తవ ప్రయోజనాలు అందరికీ చేరాలంటే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యాపారాలు కలిసికట్టుగా పని చేయాలి. అప్పుడే ఈ జీఎస్టీ 2.0 సంస్కరణలు పూర్తిగా విజయవంతం అవుతాయి.
జీఎస్టీ 2.0: ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం
ఈ కొత్త పన్నుల విధానం మన దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది. ఈ కొత్త పద్ధతి వల్ల వచ్చే లాభాలను, దాని అమలు విధానాన్ని మీడియా, ప్రభుత్వ సమావేశాలు, వెబ్సైట్ల ద్వారా ప్రజలకు, వ్యాపారులకు చాలా స్పష్టంగా చెప్పాలి.ఆర్థిక లక్ష్యాల వైపు ఒక అడుగు: జీఎస్టీ 2.0(GST 2.0) లాంటి సంస్కరణలు భారతదేశం 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలను సాకారం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగు. ఈ చర్యల ద్వారా భారతదేశం ఆర్థికంగా మరింత బలోపేతమవుతుంది. ఇది మన దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్యం వైపు ముందుకు నడిపిస్తుంది.జీఎస్టీ 2.0 ఒక కొత్త ఆశ: జీఎస్టీ 2.0 కేవలం పన్ను వ్యవస్థను మెరుగుపరచడం మాత్రమే కాదు. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా మార్చడానికి ఒక ముఖ్యమైన అడుగు. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తారు. అలాగే, పేదల సంక్షేమా నికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ విధానం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక పెద్ద మార్పు తీసుకు వస్తుంది. మొదట్లో కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, భవిష్యత్తులో ఈ విధానం మన దేశం వేగంగా ఎదగడానికి, అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి దారి చూపిస్తుంది. ఈ కొత్త జీఎస్టీ విధానం మన దేశ ఆర్థిక భవిష్యత్తుకు ఒక కొత్త మార్గం.

మనందరికీ ఒక కొత్త ఆశ
మొత్తానికి జీఎస్టీ అనేది ఒక గొప్ప మార్పు. మొదట్లో దీనికి చాలా సమస్యలు ఎదురయ్యాయి. కానీ కాలక్రమేణా ఇది మెరుగుపడుతూ వస్తోంది. భవిష్యత్తులో సరళత (సులభమైన పన్ను విధానం), పారదర్శకత (అన్ని వివరాలు స్పష్టంగా ఉండటం), రాష్ట్రాల విశ్వాసం అనే ఈ మూడు అంశాలు బలోపేతమైతేనే జీఎస్టీ మన దేశానికి ఒక నిజమైన, సమగ్ర పన్ను సంస్కరణగా నిలుస్తుంది. అలా జరిగితేనే, భారతదేశం ‘ఒకే దేశం-ఒకే మార్కెట్’ అనే కలను నిజం చేసుకోగలుగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: