న్యూఢిల్లీ: దేశ రాజధానిని పాలించేది ఎవరు..? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా.. లేక ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా..?ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఏం తేలబోతోంది..? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తోంది వార్త..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తంగా 10 వేల మంది పోలీసులను మూడంచెల్లో మోహరించింది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది.

ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీలో 2013 నుంచి ప్రభుత్వం అధికారంలో ఉంది. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కేజ్రీవాల్ పార్టీ పట్టుదలతో ఉంది. అటు ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పాలనా పగ్గాలు అందుకోవాలని బీజేపీ చూస్తోంది. అంతకుముందు 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్.. ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కన్పించట్లేదు.
ఇకపోతే..హస్తినాలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీ 36. స్థానికంగా ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.54% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వీటిని ఆప్ ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేస్తోంది.