Corbin Bosch : పాకిస్థాన్ లీగ్‌లో ఆడేందుకు జల్మి జట్టుతో ఒప్పందం ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఆల్ రౌండర్ కార్బిన్ బోష్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా లీగల్ నోటీసులు జారీ చేసింది. అసలు కారణం ఏమిటంటే,మొదట పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడేందుకు అంగీకరించిన బోష్, తర్వాత అనూహ్యంగా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌తో ఒప్పందం చేసుకోవడం.దక్షిణాఫ్రికాకు చెందిన బోష్, ఈ ఏడాది పాకిస్థాన్ మీద తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

ఆ సిరీస్‌లో అదరగొట్టడంతో పీఎస్‌ఎల్ ఫ్రాంఛైజీ పెషావర్ జల్మీ అతడిని తమ జట్టులోకి తీసుకుంది.జనవరి 13న లాహోర్‌లో జరిగిన పీఎస్‌ఎల్ ప్లేయర్స్ డ్రాఫ్ట్ పదో ఎడిషన్ సందర్భంగా ఆ ఫ్రాంఛైజీ బోష్‌ను కొనుగోలు చేసింది.అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో,అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు బోష్‌ను ఎంపిక చేసింది.అయితే బోష్ ఇప్పటికే పీఎస్‌ఎల్ ఫ్రాంఛైజీతో ఒప్పందం చేసుకుని ముంబయి ఇండియన్స్‌కు మారడం పీసీబీకి ఆగ్రహాన్ని కలిగించింది.ఈ నేపథ్యంలో అతనికి లీగల్ నోటీసులు పంపింది. తన ఒప్పందాన్ని అతిక్రమించడంపై వివరణ ఇవ్వాలని కోరింది. పీఎస్‌ఎల్ 2016లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఐపీఎల్, పీఎస్‌ఎల్ ఒకేసారి జరగలేదు.కానీ ఈసారి మాత్రం రెండూ కొద్దీ రోజుల వ్యవధిలో జరుగుతున్నాయి.సాధారణంగా ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్ ముందుగా జరుగుతుంది.కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా పీఎస్‌ఎల్ ఆలస్యమైంది.ఐపీఎల్ ప్రారంభమైన రెండు వారాల తర్వాతే పీఎస్‌ఎల్ మొదలవుతుంది.
ఈ నేపథ్యంలోనే బోష్ ఐపీఎల్‌ను ప్రాధాన్యతనిస్తూ పీఎస్‌ఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అందుకే అతడిపై పీసీబీ నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 మిగిలిన ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది.ఈ నెల 22న మెగా టోర్నీకి శ్రీకారం చుట్టనున్నారు.తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనున్నాయి.