తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో, టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
సుభాష్ రెడ్డి గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును, పార్టీని దుర్భాషలాడినట్లు ఫిర్యాదులు అందాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించాయని అధిష్ఠానం భావించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన పార్టీ హైకమాండ్ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది.

ఈ ఘటనపై వివరణ కోరుతూ 2023 చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారు. 2024 నవంబర్ 21లోపు వివరణ ఇవ్వాలని సూచించారు. సుభాష్ రెడ్డి 2024 నవంబర్ 20న తన సమాధానం ఇచ్చినా, అది అధిష్ఠానాన్ని సంతృప్తి పరచలేకపోయింది. అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా సుభాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు అధికారిక ప్రకటన వెలువరించారు. ఈ సస్పెన్షన్ నేటి నుండి అమల్లోకి వస్తుందని పార్టీ స్పష్టంగా తెలిపింది.