బీజేపీ పాలనలో అన్ని విధాలుగా అణచివేత
హైదరాబాద్ : నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం అవసరమని వివరించారు. రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కుటుంబ సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలోనే ఈ ఏడాది ఎక్కువ ధాన్యం
బీజేపీ పాలనలో దేశంలో అన్ని విధాలుగా అణచివేత కొనసాగుతోందని ఆరోపించారు. ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని.. ప్రచారం చేయడంలో కొంత వెనుకబడిపోయామని తెలిపారు. దేశం మొత్తంలో తెలంగాణలోనే ఈ ఏడాది ఎక్కువ ధాన్యం పండించినట్లు పేర్కొన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని.. ఇవన్నీ జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకోవాలని వివరించారు.
ఏడాదిలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకున్నాం.. మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. రైతులకు రుణమాఫీ చేశాం.. రైతు భరోసా చెల్లించాం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాదిలోనే అనేక పనులు చేశామని.. అన్నీ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని.. దానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. అంతకుముందు ఇంతకాలం తెలంగాణ కాంగ్రెస్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షీకి ధన్యవాద తీర్మానం పెట్టారు.