ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జాతీయ అవార్డు విషయంలో అల్లు అర్జున్ కుట్ర పన్నారనే అనుమానాలను వ్యక్తం చేశారు మల్లన్న. జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ పాత్రపై మల్లన్న పలు ప్రశ్నలను లేవనెత్తారు.
తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. “తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తనొక్కడికే దక్కాలని అల్లు అర్జున్ కుట్ర పన్నారా?” అని ప్రశ్నించారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో కూడా అర్జున్ పాత్ర ఉందని, ఇది పూర్తిగా పరిశీలించాల్సిన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చినప్పటికీ, ఆయన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలంటూ లేఖ రాయించడం వెనుక కూడా అల్లు అర్జున్ పాత్ర ఉందని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు ఇంకా స్పందించలేదు. జాతీయ అవార్డు వంటి ప్రతిష్ఠాత్మక గుర్తింపును ఇలా వివాదంలోకి లాగడం అర్థరహితం అని ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ ఇటీవలే జాతీయ అవార్డు గెలుచుకొని, అభిమానులను సంబరాల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే. కానీ ఈ వివాదాలు ఇప్పుడు ఆయన గౌరవంపై మచ్చ వేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. జానీ మాస్టర్ కేసులో అసలు సత్యాలు ఏంటన్నది త్వరలో వెలుగులోకి రావాల్సి ఉంది.