ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దీంతో అక్కడి రాజకీయ పార్టీలు అయిన ఆప్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు.. ప్రాంతీయ పార్టీలు కూడా ఓటర్లను ఆకర్షించుకునే పనిలో పడ్డారు. పోటీ చేసే రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారు. దీని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఓటర్లకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల బీజేపీ ఓటర్లను ఆకర్షించుకునేందుకు ఎన్నో వరాలను ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా కాంగ్రెస్ కూడా ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. ఐదు గ్యారెంటీలతో కొత్త మ్యానిఫెస్టోను విడుదల చేసింది. దీనిలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం ప్రకటించింది.

ప్రజలందరికీ ఆరోగ్యబీమా కల్పించడంలో భాగంగా.. అందరికీ ఆరోగ్యం పేరుతో పథకం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఢిల్లీలో కూడా.. మెహంగై ముక్తి యోజన పథకం ద్వారా రూ.500 లకే సిలిండర్ ను అందిస్తామన్నారు. వీటితో పాటు.. సీనియర్ సిటిజన్లకు ఉచితంగా రేషన్ కిట్స్, ట్రాన్స్‌జెండర్లు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేదలకు నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ కల్పిస్తామన్నారు. ఇక యువత కోసం నెలకు రూ.8500 స్టైఫండ్ అందిస్తామన్నారు. వీటిని ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఒక ఏడాది అప్రెంటీస్‌షిప్ ద్వారా ఈ స్టైఫండ్ అందించనున్నారు.