ఆదిలాబాద్: ఆసియాలో 2వ అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. నాగోబా జాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబా జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. జాతర 3వ రోజున జాతరలో అతి ముఖ్యమైన దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ నాగోబా దర్బార్, రేపు బేతల్ పూజలు, మండగాజిలింగ్.. ఎల్లుండి షాంపూర్ జాతర జరుగుతాయి. గిరిజనుల సమస్యలపై కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం దర్బార్ నిర్వహిస్తారు.

సమస్యలను నేరుగా అధికారులు-ప్రజాప్రతినిధులకు తెలిపేందుకు దర్బార్ జరుగుతుంది. 1942లో మొట్టమొదటిసారి నాగోబా దర్బార్ నిర్వహించారు. ఉట్నూర్ ఐటీడీఏ అధికారులతో పాటు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు గిరిజనుల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సమస్యల పరిష్కారం చేస్తారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షాతోపాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం,జిల్లాకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ దర్బార్‌కు హాజరవుతారు. కాగా, శనివారం బేతల్ పూజలు, మండగాజిలింగ్, ఆదివారం షాంపూర్ జాతర జరుగనున్నాయి.
గిరిజనుల ఆరాధ్య దైవం హైమన్ డార్ఫ్ ఆధ్వర్యంలో ఈ దర్బార్ జరిగింది. అడవిబిడ్డల సమస్యలపై అధ్యయనం చేయడానికి ఆనాడు హైమన్ డార్ఫ్ ను నిజాం సర్కార్ పంపిన విషయం తెలిసిందే. హైమన్ డార్ఫ్ ప్రారంభించిన దర్బార్ నేటికీ కొనసాగుతున్నది. ఇక, దర్బార్ రోజున తెలంగాణ జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు తరలివస్తారు. దర్భారులో ఆదివాసీలు తమ సమస్యలను ప్రజా ప్రతినిధులకు, ఆఫీసర్లకు విన్నవిస్తారు.దాంతో ఇక్కడ పాలకులు ఇచ్చే హామీలు నెరవేరుతాయని వారి విశ్వాసం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నిర్వహిస్తున్న నాగోబా జాతరలో భాగంగా గురువారం నాగోబా టెంపుల్ వెనుక మెస్రం వంశీయులు పెర్సపేన్, భాన్ దేవతకు ఘనంగా పూజలు నిర్వహించారు. భేటింగ్ అయిన కొత్త కోడళ్లు టెంపుల్‌కు చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నాగోబా జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. నాగోబాను దర్శించుకుంటున్నారు.