ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తణుకులో పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రాన్ని శుభ్రంగా, హరితంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
తణుకుకు సీఎం ప్రయాణ వివరాలు
ఉదయం 7:30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరిన సీఎం చంద్రబాబు, ఉదయం 8:05కి తణుకు చేరుకోనున్నారు. అక్కడ ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పారిశుద్ధ్య కార్యకర్తల కష్టనష్టాలను అడిగి తెలుసుకుని, వారి సమస్యలపై సమీక్ష నిర్వహించే అవకాశముంది.
పార్టీ శ్రేణులు, అధికారులతో సమీక్ష
తణుకులో సీఎం చంద్రబాబు, పార్టీ శ్రేణులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాభివృద్ధి, శుభ్రత, పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష చేయనున్నట్లు సమాచారం. సుమారు మధ్యాహ్నం 12:55 గంటలకు సీఎం తన పర్యటన ముగించుకుని తిరిగి ఉండవల్లికి బయలుదేరనున్నారు.

పర్యటనకు భద్రతా ఏర్పాట్లు
సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా పరమైన ఏర్పాట్లను సమీక్షించిన అధికారులు, సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు.