మహాకుంభ్ సక్సెస్..వర్కర్లకు 10వేల బోనస్
ప్రయాగ్‌రాజ్: ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగిన మహాకుంభ్ .. మహాశివరాత్రితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ .. త్రివేణి సంగమంలోని అరైల్ ఘట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోటులో ప్రయాణం చేసి .. గంగా హారతిలో పాల్గొన్నారు. యూపీ క్యాబినెట్ ఆ ఈవెంట్‌లో పాల్గొన్నది. డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్, కేపీ మౌర్య, ఇతర మంత్రులు కూడా ఉన్నారు. ఆ తర్వాత పారిశుద్ధ కార్మికులతో కలిసి సీఎం యోగి భోజనం చేశారు. లంచ్‌లో మంత్రులు, పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.

శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం 16వేలు
సీఎం యోగి మాట్లాడుతూ.. మహాకుంభ్‌లో పాల్గొన్న శానిటేషన్, హెల్త్ వర్కర్లకు పది వేల బోనస్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం 16వేలు అందే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. తాత్కాలిక హెల్త్ వర్కర్లకు.. నేరుగా నగదును బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్లు తెలిపారు. ఆ కార్మికులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు చెప్పారు. మహాకుంభలో సుమారు 66 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు.
కొత్త రికార్డులు
కాగా, మహా కుంభమేళాలో స్నానం చేసేందుకు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నవారి సంఖ్య కొత్త రికార్డులను సృష్టించింది. కుంభమేళా నుండి తిరిగి వెళ్లినవారు వారితో పాటు ఈ పుణ్య జలాలను తమ ప్రాంతాలకు తీసుకువెళ్లి, లక్షలాది మంది చేత కుంభస్నానం చేయించారు. ఇది గత కొన్ని దశాబ్దాలలో ఇంతకు ముందెన్నడూ జరగని ఉదంతం. ప్రయాగ్‌రాజ్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అధికారులు మునుపటి కుంభమేళా అనుభవాల ఆధారంగా నూతన ప్రణాళికను రూపొందించారు. అమెరికా జనాభా కు దాదాపు రెట్టింపు జనాభా ఈ ఐక్యతా కుంభమేళాలో పాల్గొని స్నానాలు చేశారు.