మొదటి విడతలో 72,045 ఇళ్లకు శంకుస్థాపన
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఈరోజు మరో అడుగు పడనుంది. జనవరి 26న తొలి విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొననున్నారు.

పోలెపల్లి ఎల్లమ్మ జాతరకు సీఎం
ముందుగా హైదరాబాద్ నుంచి మధ్యాహ్నానికి హెలికాప్టర్‌లో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలెపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఏటా ఘనంగా నిర్వహించే పోలెపల్లి ఎల్లమ్మ జాతరలో పాల్గొంటారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలానికి 8 కిలోమీటర్ల దూరంలో పోలెపల్లి అమ్మవారు స్వయంభూగా వెలిశారు. జాతరలో ప్రధాన ఘట్టమైన సిడెను తిలకించేందుకు తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు అధికంగా తరలివస్తారు. పోలెపల్లి జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అమ్మవారి దర్శనానంతరం సిడెను తిలకిస్తారు.
జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన
సీఎం రాకను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. నాలుగు లక్షల మందికి పైగా హాజరయ్యే ఈ జాతరకు సీఎం సైతం హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలెపల్లి నుంచి హెలికాప్టర్‌లోనే నేరుగా నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లి గ్రామం సింగారం కూడలి గురుకుల వసతి గృహానికి చేరుకుంటారు. అక్కడికి సమీపంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అప్పక్‌పల్లి గ్రామానికి చేరుకుని ఇందిరమ్మ గృహాల శంకుస్థాపనలో పాల్గొంటారు. అక్కడి నుంచి నారాయణపేట వైద్య కళాశాలకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు.