ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి
హైదరాబాద్: గ్యాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సి వ్యూహాలపై శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ జరిగింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు సైతం హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని 42 అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని పెట్టండి
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారాన్నిపకడ్బందీగా నిర్వహించాలన్నారు. 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించాలని సూచించారు.ఇక యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు గ్రామ స్థాయి నుంచి వ్యూహాలు రచించాలన్నారు. ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉన్న వాళ్లను కూడా ఓట్లు వేయించేలా బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అభివృద్ధి,సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని మంత్రులు, నేతలకు సూచించారు. గాంధీభవన్‌లో కంట్రోల్ రూమ్ పెట్టి నిరంతరం పర్యవేక్షించాలని పార్టీ నేతలను ఆదేశించారు.
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టేలా కృషి చేయాలి
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక చాలా కీలకమైనదని, ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టేలా కృషి చేయాలని కోరారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని 42 అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్‌చార్జీలు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.