రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ రాసిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ రాసిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఐఏఎస్ అధికారుల సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పుస్తక రచయితకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశానికి సేవ చేసిన అధికారుల అనుభవాలు సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.

ప్రజాసేవకే తమ జీవితాన్ని అంకితం
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తన రాజకీయ ప్రస్థానంలో అనేక మంది అధికారులను చూశానని అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గా, మండలి సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు సీఎంగా ఉన్న తన అనుభవాన్ని పంచుకున్నారు. గతంలో అధికారులు ప్రజల మధ్యనే గడిపేవారని, ప్రజాసేవకే తమ జీవితాన్ని అంకితం చేసేవారని గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం ఆ విధానం తగ్గిపోతోందని, ప్రజలకు సేవ చేయడమే అసలైన పాలన అని వివరించారు.
అధికారుల సహకారం ఎంతో అవసరం
ప్రజలను ఆకర్షించేందుకు రాజకీయ నేతలు ఎన్నో హామీలు ఇస్తుంటారని, కానీ ఆ హామీలు అమలయ్యే విధంగా ఉండాలంటే అధికారుల సహకారం ఎంతో అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. పాలనలో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దే బాధ్యత అధికారులదేనని, కానీ ఇప్పుడు అలాంటి ధైర్యం గల అధికారులు తగ్గిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాలనలో పారదర్శకత ఉండాలంటే, నాయకులను సరైన దారిలో నడిపించాల్సిన అవసరం ఉందని అన్నారు.
తప్పు చేయొద్దు అని చెప్పేవాళ్లకంటే మూడు తప్పులు చేద్దాం
అధికారులు ప్రజల పక్షాన నిలబడి పని చేయాలని సూచించిన సీఎం, “తప్పు చేయొద్దు అని చెప్పేవాళ్లకంటే మూడు తప్పులు చేద్దాం అని చెప్పేవారే ఎక్కువ” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొత్త అధికారులు సీనియర్లను గౌరవించి, వారి అనుభవాల నుంచి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. నిజమైన ప్రజాసేవకులుగా ఉండాలంటే, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడానికి ముందుకు రావాలని సూచించారు.