ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తాళ్లపూడి మండలంలోని మలకపల్లి గ్రామాన్ని సందర్శించి, NTR భరోసా పథకం (NTR Bharosa Scheme) కింద పెన్షన్లు లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు రూపంలో పెన్షన్లు అందజేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం ప్రజల్లో విశేష ఆసక్తిని రేపుతోంది.
పీ4 సభలో సీఎం ప్రసంగం
పెన్షన్ల పంపిణీ అనంతరం చంద్రబాబు పీ4 సభలో పాల్గొననున్నారు. ఇందులో పార్టీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరవుతారు. రాష్ట్రంలో వైసీపీ పాలన తరువాత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న వేగవంతమైన చర్యలు, సంక్షేమ పథకాల అమలుపై చంద్రబాబు వివరణ ఇవ్వనున్నారు. పీ4 సభ ద్వారా ప్రజలకు ప్రభుత్వ విధానాలను తెలియజేయడమే కాక, సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు.
కుప్పం పర్యటనకు కూడా సిద్ధత
తూర్పుగోదావరి పర్యటన ముగించుకున్న తర్వాత చంద్రబాబు అదే రాత్రి తన స్వగ్రామమైన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలానికి బయలుదేరతారు. అక్కడ కడపల్లిలోని తన సొంతింటికి చేరుకుంటారు. మరుసటి రోజు ఆయన సాధికార సమితి సభ్యుల కుటుంబాలను కలుసుకుని, వారి సమస్యలు విని, పరిష్కారాలపై చర్చిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలు ప్రభుత్వ పథకాల పర్యవేక్షనకే కాకుండా, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలుపుకునే దిశగా జరుగుతున్నాయి.
Read Also : HYDRA: మాదాపూర్ సున్నం చెరువు ఆక్రమణలపై హైడ్రా కొరడా