ఈ ఏడాదే తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు పై చర్చ
అమరావతి: ఈనెల 28న ఉభయ సభల్లో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వార్షిక బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ఉండవల్లి లోని తన నివాసంలో సమీక్షించారు. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్‌లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల అమలుకు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కార్కు సవాల్‌గా మారింది. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచిత ఇసుక వంటి పాలసీతో ప్రభుత్వం ఆదాయం వదులుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛన్ల పెంచడంతోపాటు నెలకు రూ.2,720 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోందనే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయంతో కొంత ఊరట లభించిందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.