ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో విద్యుత్తు వినియోగం
తెలంగాణలో ఎండల ప్రభావం ముందుగానే చూపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల నుంచే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో, విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నెల 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 15,804 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది మార్చిలో ఇదే స్థాయిలో డిమాండ్ ఉండగా, ఈసారి ఫిబ్రవరిలోనే ఆ రికార్డు దాటడం విశేషం. విద్యుత్ వినియోగం పెరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ట్రిప్పింగ్ సమస్యలు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలకొద్దీ కొత్త కనెక్షన్లు ఇస్తున్నప్పటికీ, వేసవి మొదలవగానే రోజుకు ఒక్కసారి లేదా రెండుసార్లు కరెంట్ పోతుందని ప్రజలు చెపుతున్నారు. విద్యుత్ సరఫరాలో కోతలు పెట్టకుండా 24 గంటల కరెంట్ అందిస్తున్నా, లోడింగ్ పెరుగుదల కారణంగా ట్రిప్పింగ్ సమస్యలు ఎక్కువయ్యాయి.

విద్యుత్ వినియోగంలో సమయానుసారంగా మార్పులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. శీతాకాలంలో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య గరిష్ఠ డిమాండ్ నమోదయ్యేది. అయితే, ప్రస్తుతం సాయంత్రం 6.40 గంటల నుంచి 7.40 గంటల మధ్య విద్యుత్ వినియోగం అత్యధికంగా పెరుగుతోంది. దీపాలు, ఫ్యాన్లు, ఏసీల వినియోగం విపరీతంగా పెరగడంతో డిమాండ్ అత్యధిక స్థాయికి చేరుకుంటోంది.
ప్రస్తుతం తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలుగా, రాత్రివేళ 21 డిగ్రీలుగా ఉన్నాయి. ఉక్కపోత కారణంగా ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగాన్ని పెంచడం విద్యుత్ డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాను నిలకడగా కొనసాగించేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రిప్పింగ్ సమస్యలు తగ్గించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వేసవి నెలల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ప్రభుత్వం ముందుగా తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.