ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త ప్రకటించారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా, ప్రతీ ఒక్కరికీ రూ.15,000 చొప్పున మే నెలలో అందజేస్తామని వెల్లడించారు. దీని ద్వారా విద్యార్థుల చదువుకు ఏ విధంగా అవరోధాలు లేకుండా చూడగలుగుతామన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.
రైతుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఇక రైతుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఒక్కో రైతుకు రూ.20,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా, సాగు కొనసాగించేందుకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల సాయం
ఇదే విధంగా మత్స్యకార కుటుంబాలను కూడా ప్రభుత్వం విస్మరించబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలకు కూడా రూ.20,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో పాటు, వారికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ఇక ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. జూన్ నాటికి DSC ప్రక్రియ పూర్తవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. వారికి మంచి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని సీఎం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా పాలన కొనసాగిస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తామని చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు.