ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకుకు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అభివృద్ధి ప్రణాళికలు, పర్యావరణ పరిరక్షణపై ఆయన తన అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయనున్నారు.
ప్రజావేదికలో సీఎం ప్రసంగం
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాలను ఆయన వివరిస్తారు. ప్రజా సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి కూడా సీఎం చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు హాజరుకానున్నారు.
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ ప్రదర్శన
సీఎం చంద్రబాబు తణుకులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో పర్యావరణహిత పదార్థాలను ప్రోత్సహించే ఉత్పత్తులు ప్రదర్శించనున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కొత్త విధానాల గురించి ఆయన వివరించనున్నారు.

భద్రతా ఏర్పాట్లు సమీక్ష
సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రజా సమూహాలు ఎక్కువగా పాల్గొనే ఈ కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇవాళ లేదా రేపటికి ఖరారయ్యే అవకాశం ఉంది.