తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మై బేబీ DNA’ (My Baby) చిత్రం – ఒక సమగ్ర సమీక్ష!
ఇటీవల తమిళంలో ఘన విజయం సాధించిన ‘DNA‘ చిత్రం, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మై బేబీ’ (My Baby) పేరుతో వచ్చింది. ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ (Suresh) కొండేటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను అందించిన సురేష్ కొండేటి, ఈసారి ‘మై బేబీ’ అంటూ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉందనే ఆసక్తితో ఉన్నారు. నెల్సన్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమిళ నటుడు అథర్వ, మలయాళ నటి నిమిషా సజయన్ కీలక పాత్రల్లో నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతమేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథాంశం
‘మై బేబీ’ (My Baby) చిత్రం ఆనంద్ (అథర్వ) మరియు దివ్య (నిమిషా సజయన్) అనే జంట చుట్టూ తిరుగుతుంది. తన మొదటి ప్రేమ విఫలం కావడంతో ఆనంద్ మద్యానికి బానిసవుతాడు. మరోవైపు, దివ్య బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటుంది. అనుకోకుండా వీరిద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఆనంద్ దివ్య మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు, వారిద్దరూ సంతోషంగా జీవిస్తారు. ఈ క్రమంలోనే దివ్య గర్భవతి అవుతుంది, వారికి ఒక బాబు పుడతాడు. అయితే, బిడ్డ పుట్టిన కొన్ని నిమిషాలకే, ఆ బిడ్డ తమది కాదని, ఎవరో ఆసుపత్రిలో మార్చేశారని దివ్య పదేపదే చెబుతుంది. ఆమె మానసిక స్థితి కారణంగా మొదట ఎవరూ ఆమె మాటలు నమ్మరు. కానీ ఆనంద్ తన భార్య మాటలను నమ్మి, నిజం తెలుసుకోవడానికి బయలుదేరతాడు. తన బిడ్డను కనుగొనే క్రమంలో, పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముకునే ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఆనంద్ కనుగొంటాడు. ఈ నెట్‌వర్క్‌ని ఎవరు నడుపుతున్నారు? ఆనంద్ దీన్ని ఎలా కనిపెట్టాడు? దివ్య తన బిడ్డను మార్చేశారని ఎలా తెలుసుకుంటుంది? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
తమిళంలో ఘన విజయం సాధించిన ‘DNA’ చిత్రాన్ని తెలుగులోకి ‘మై బేబీ DNA’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమా విషయానికి వస్తే, దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ఎంచుకున్న కథాంశం అత్యద్భుతంగా ఉంది. ఆ కథాంశాన్ని తెరపైకి తీసుకురావడానికి ఆయన చేసిన పరిశోధన, దాన్ని సన్నివేశాలుగా మలిచిన తీరు అద్భుతంగా ఆకట్టుకుంటుంది. కథ అనుక్షణం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగుతూ అనేక మలుపులు తిరుగుతుంది. ప్రేక్షకుడిని చివరి వరకు ఊపిరి బిగబట్టి చూసేలా దర్శకుడు సినిమాను నడిపించారు. సినిమాలో ఒక్క సన్నివేశం కూడా అనవసరం అని చెప్పడానికి వీలు లేకుండా ప్రతి ఫ్రేమ్ చాలా చక్కగా రూపొందించారు.
నటీనటుల ప్రదర్శన
నటీనటుల ప్రదర్శన విషయానికి వస్తే, ఈ సినిమా కథలో ఆనంద్‌గా అథర్వ, దివ్యగా నిమిషా సజయన్, మరియు కానిస్టేబుల్‌గా బాలాజీ శక్తివేల్ నటన హైలైట్‌గా నిలిచింది. బ్రేకప్ అయిన ప్రేమికుడిగా, బిడ్డను కోల్పోయిన తల్లి వేదనను అర్థం చేసుకుని న్యాయం చేయాలనుకునే భర్తగా, అలాగే తన కన్నబిడ్డను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే తండ్రిగా అథర్వ నటన చాలా బాగుంది. నటనతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అద్భుతంగా రాణించాడు. మానసిక సమస్యతో బాధపడే యువతిగా, పుట్టిన కొడుకు దక్కని తల్లిగా నిమిషా సజయన్ అద్భుతంగా నటించింది. ఇక అథర్వకు తోడుగా కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన బాలాజీ శక్తివేల్, తన ఫీల్‌గుడ్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాను కొత్త జోన్‌లోకి తీసుకెళ్లాడు. మహ్మద్ జీషన్ అయ్యుబ్ పాత్ర నిడివి తక్కువే అయినా, గుర్తుండిపోయే నటనను ప్రదర్శించాడు.
సాంకేతిక అంశాలు
ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించిన జీబ్రాన్‌కు ఫుల్ మార్కులు వేయాల్సిందే. ముఖ్యంగా సెకండాఫ్ ఎమోషనల్ సీన్లలో, యాక్షన్ సన్నివేశాల్లో, అలాగే క్లైమాక్స్‌లో వచ్చే టెంపుల్ ఎపిసోడ్‌లో మ్యూజిక్‌తో జీబ్రాన్ అరిపించేశాడు. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా తాము ఏ మాత్రం తక్కువ కాదనే విధంగా సినిమాను పరుగులు పెట్టించాయి. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. అలాగే పాత్రలకు నటీనటుల ఎంపిక చాలా బాగుంది.
ముగింపు
చివరిగా, స్క్రీన్ మీద నుంచి తల తిప్పకుండా చూసేలా ఈ సినిమా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చూశాను అనే భావన మీకు కూడా కలుగుతుంది. థియేటర్లలో ఈ సినిమాను చూసి మంచి అనుభూతిని పొందండి.
‘మై బేబీ’ సినిమా కథలో ప్రధాన సమస్య ఏమిటి?
కథలో దివ్య తన బిడ్డను ఆసుపత్రిలో మార్చేశారంటూ ఆరోపించడమే ప్రధాన సమస్యగా నిలుస్తుంది.
‘మై బేబీ’లో అథర్వ పాత్ర ఎలా ఉంటుంది?
అథర్వ తన భార్యను నమ్మి బిడ్డను వెతికే సాహసోపేతమైన పాత్రలో కనిపించి, ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Vijay Deverakonda: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విజయ్ దేవరకొండ