తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం, మోహన్ బాబు కలల ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల ప్రకటన నుంచి ట్రోలింగ్స్‌తో నిండిన ఈ సినిమాకు అనూహ్యంగా రిలీజ్ సమయంలో మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ఈ బజ్ కు తగినట్టుగా ‘కన్నప్ప’ (Kannapa) ఉందా? భక్తిరస ప్రధాన చిత్రానికి మంచు విష్ణు న్యాయం చేశాడా? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
కన్నప్ప అనగానే తెలుగు సినీ ప్రేక్షకులకు 1955లో విడుదలైన కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటించిన కాళహస్తి మహత్యం, 1976లో బాపు దర్శకత్వంలో వచ్చిన భక్త కన్నప్ప చిత్రాలు గుర్తుకు వస్తాయి. సహజంగానే ఈ రెండు క్లాసిక్ సినిమాలతో ప్రస్తుత కన్నప్పను పోల్చే వారుంటారు. అయితే నేటి అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని, భారీ స్థాయిలో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో మహాభారతంతో పాటు పలు భక్తిరస సీరియల్స్‌ను రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

కథా సంగ్రహం
కన్నప్ప కథ అందరికీ సుపరిచితమే. కోయ గూడేనికి చెందిన తిన్నడు (Manchu Vishnu), చిన్ననాటి చేదు అనుభవాల వల్ల నాస్తికుడిగా మారతాడు. తమ గూడెం క్షేమం కోసం నరబలి ఇవ్వాలని చెప్పే మారమ్మ (Aishwarya Bhaskaran) అంటే అతనికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అయినా తండ్రి నాథనాధుడు (శరత్ కుమార్) మాట కాదనలేక తన కోపాన్ని అణచుకుంటాడు. ఈ ఆటవీ ప్రాంతంలో మరో మూడు కొండ జాతులు నివసిస్తుంటాయి. వాటిలో భద్రగణం ఉండే గూడెంలో దివ్య శక్తులు కలిగిన వాయులింగం ఉంటుంది. దానిని ఇతరుల కంట పడకుండా మహదేవ శాస్త్రి (Mohan Babu) పూజిస్తుంటాడు. ఈ శక్తివంతమైన వాయులింగాన్ని సొంతం చేసుకోవాలని అత్యంత క్రూరుడైన కాలముఖుడు (Arpit Ranka) ప్రయత్నిస్తాడు. అతడిని ఎదుర్కోవడానికి నాలుగు గూడేల ప్రజలు ఏకమవ్వాలని నాథనాధుడు సూచిస్తాడు. మరి నాథనాధుడి కోరికను మన్నించి, వీరంతా ఒక్కటయ్యారా? కాలముఖుడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారా? నాస్తికుడైన తిన్నడు ఆస్తికుడిగా ఎలా మారాడు? వాయులింగాన్ని దర్శించుకోవాలని కలలు కన్న తిన్నడి భార్య నెమలి (ప్రీతి ముకుందన్) కోరిక తీరిందా? తిన్నడిని భక్తి మార్గం వైపు నడిపించడానికి పరమ శివుడు (Akshay Kumar).. రుద్ర (ప్రభాస్)ను ఎలా పావుగా ఉపయోగించుకున్నాడు? అన్నది మిగతా కథ.
ధూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం గ్రంథంతో పాటు మరికొన్ని పురాణాల్లోని అంశాలను తీసుకుని తిన్నడి కథను రూపొందించారు. ద్వాపరయుగంలోని అర్జునుడే ఆ తర్వాత తిన్నడిగా జన్మించాడని అంటారు. అందుకు కిరాతార్జునీయంను ఆధారంగా చూపుతారు. పరమ శివుడు కిరాతుడిగా వచ్చి అర్జునుడి శక్తిని పరీక్షించి పాశుపతాస్త్రం ఇచ్చాడని చెబుతారు. అదే సమయంలో తనకు మోక్షం ప్రసాదించమని అర్జునుడు కోరగా, తిన్నడిగా పుట్టినప్పుడు మోక్షం ప్రసాదిస్తానని శివుడు చెప్పినట్టుగా ఉంది. ఈ చిత్రంలో ఆ ఎపిసోడ్‌ను కూడా చూపించారు.
విశ్లేషణ
మూడు గంటల నిడివి ఉన్న కన్నప్ప చిత్రంలో మొదటి రెండు గంటలు వీర కన్నప్ప గాథను చెప్పిన దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్.. చివరి గంటను భక్త కన్నప్పగా మలిచారు. దాంతో ఒకే టిక్కెట్‌పై రెండు చిత్రాలు చూసిన భావన కలుగుతుంది. మొదటి రెండు గంటలు కన్నప్ప ప్రేమాయాణం, అతని వీరత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు. కాలముఖుడి మరణం తర్వాత ప్రభాస్.. రుద్రగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి సినిమా పోకడ పూర్తిగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా ప్రభాస్‌కు మోహన్ బాబుకు, ప్రభాస్‌కు తిన్నడికి, ప్రభాస్‌కు నెమలికి మధ్య ఉండే సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి. అలాగే తనవు చాలించే ముందు నాథనాధుడికి, అతని కొడుకు తిన్నడికి మధ్య సాగే సంభాషణలు ఆర్ద్రతతో కూడుకుని ఆకట్టుకుంటాయి.
సినిమా శివపార్వతుల (Akshay Kumar, Kajal) సంభాషణతో మొదలవుతుంది. అక్కడ నుండి విష్ణు కవల కుమార్తెలు అరియానా, వివియానా పాడే పాటతో దారిలో పడుతుంది. బాల తిన్నడిగా విష్ణు కుమారుడు అవ్రామ్ నటించాడు. అతను తెర మీద చూడటానికి బాగానే ఉన్నా.. కోయ బాలుడిగా అతని సంభాషణలు సెట్ కాలేదు. ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించి ఉండాల్సింది. ఇక ప్రారంభంలో శివపార్వతులకు సంబంధించిన సంభాషణలు విన్నప్పుడు ఆదివారం టీవీలో వచ్చే హిందీ డివోషనల్ డబ్బింగ్ సీరియల్ చూస్తున్న భావన కలుగుతుంది. అయితే అది కాసేపు మాత్రమే! తర్వాత సినిమా గాడిలో పడిపోతోంది.
నటీనటుల ప్రతిభ
నటీనటుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మోహన్ బాబు గురించి. మహదేవశాస్త్రిగా ఆయన అద్భుతంగా నటించారు. తిన్నడిగా మంచు విష్ణు తనవంతు పూర్తి న్యాయం చేయడానికి కృషి చేశాడు. సినిమా క్లయిమాక్స్‌కు చేరేసరికి శివ భక్తుడిగా మారిన వైనం అందరినీ ఆకట్టుకుంటుంది. నటుడిగా విష్ణులో పరిణతి కనిపిస్తుంది. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ గ్లామరస్‌గా కనిపించింది. యువతను ఉత్తేజపరిచే విధంగా ఆమెపై చిత్రీకరించిన రెండు పాటలు ఉన్నాయి. ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించినంత సేపు గూస్ బంప్స్ రావడం ఖాయం. అతని ఆహార్యానికి తగినట్టుగానే మంచి సంభాషణలు పడ్డాయి. పనిలో పనిగా ఆ పాత్ర పెళ్లి గురించి చేసిన ప్రస్తావన.. థియేటర్‌లో విజిల్స్ వేయిస్తుంది. సినిమా ప్రారంభం అక్షయ్, కాజల్‌తో మొదలై, మోహన్ లాల్ ఎంట్రీతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇక మూవీ ప్రీ క్లయిమాక్స్‌లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ రకంగా ఈ ప్రత్యేక పాత్రధారులను దర్శకుడు చక్కగా వాడుకున్నారు. విష్ణు తండ్రిగా శరత్ కుమార్ చక్కని నటన ప్రదర్శించారు. ఇతర కీలక పాత్రలను మధుబాల, ముఖేష్ రిషి, కౌశిక్, శివబాలాజీ, రఘుబాబు, ఐశ్వర్య, బ్రహ్మానందం, సప్తగిరి, బ్రహ్మాజీ, సురేఖవాణి, దేవరాజ్, అర్పిత్ రాంకా తదితరులు పోషించారు.
స్టిఫెన్ దేవస్సి సమకూర్చిన సంగీతం, షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ, ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి పాటలను రాశారు. సినిమా నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. బయట ప్రచారం జరిగినట్టుగా ఎవరినీ కించపరిచే సన్నివేశాలు కానీ, ఎవరినీ తక్కువ చేసి చూపే సీన్స్ కానీ ఇందులో లేవు. ప్రొడక్షన్ వాల్యూస్‌కు మోహన్ బాబు పెద్ద పీట వేశారు. భారీగానే ఖర్చు పెట్టారు. కానీ గ్రాఫిక్స్ మాత్రం కొన్ని చోట్ల ఆ స్థాయిలో లేవు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కు వచ్చి ‘కన్నప్ప’ను చూస్తే… ప్రేక్షకులకు సర్ ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. అయితే కమర్షియల్‌గా వారికి ఈ పాజిటివిటీ ఏ మేరకు ఉపకరిస్తుందనేది వేచి చూడాలి.
Read also: Bigg Boss 9: ‘ఈసారి చదరంగం కాదు రణరంగమే’..బిగ్‌బాస్ 9 ప్రోమో