నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘లెవన్’ (Eleven) చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేశ్ అజిల్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 16న థియేటర్లలో విడుదల కాగా, జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథా నేపథ్యం
విశాఖపట్నంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడు ఎవరూ, హత్యల వెనుక కారణమేమిటి అనేది పోలీసులకు అంతుబట్టదు. హత్య చేసిన వారందరినీ హంతకుడు ఆనవాళ్లు లేకుండా కాల్చివేస్తాడు. ఈ కేసును పోలీస్ ఆఫీసర్ రంజిత్ కుమార్ (శశాంక్) విచారిస్తుండగా, అనుకోకుండా జరిగిన ప్రమాదంతో ఆయన కోమాలోకి వెళతారు. దాంతో, ఈ కేసు బాధ్యతలను ఏసీపీ అరవింద్ (నవీన్ చంద్ర)కు అప్పగిస్తారు. మనోహర్ అనే మరో పోలీస్ ఆఫీసర్‌తో కలిసి అరవింద్ సైకో కిల్లర్‌ను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు. సంజన అనే యువతి తనను ప్రేమిస్తున్నా పట్టించుకోకుండా, అరవింద్ తన విధిపైనే పూర్తి దృష్టి పెడతాడు. ఒకవైపు అరవింద్ గాలిస్తూ ఉండగానే, మరోవైపు హంతకుడు హత్యలు చేస్తూనే ఉంటాడు. మీడియా ఒత్తిడి కారణంగా, పై అధికారులు అరవింద్‌పై ఒత్తిడి తెస్తారు.
దీంతో అరవింద్ మరింత వేగం పెంచుతాడు. హంతకుడు కవలలను లక్ష్యంగా చేసుకుని, కవలల్లో ఒకరిని మాత్రమే చంపుతున్నాడని గ్రహిస్తాడు. హంతకుడు ఎవరు? అతను కవలలను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు? వారిలో ఒకరిని చంపడానికి కారణాలు ఏమిటి? అది తెలుసుకున్న అరవింద్ ఏం చేస్తాడు? మరికొన్ని హత్యలు జరగకుండా ఆయన ఆపగలుగుతాడా? జరుగుతున్న హత్యలకు, ’11’ అనే నంబర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.

విశ్లేషణ
ఇదొక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కథ. ఈ తరహా కథలు అనూహ్యమైన మలుపులతో, ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగాలి. ‘లెవన్’ కథలో ఆ లక్షణాలు ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో లేవని చెప్పాలి. తెరపై హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వీటితో ముడిపడిన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? హంతకుడు ఎలా పట్టుబడతాడు? అనేది ఈ తరహా కథల బలాన్ని నిర్ణయిస్తాయి. అయితే ఈ కథలో కిల్లర్ కిడ్నాప్ చేసే దృశ్యాలు, హత్య చేసే దృశ్యాలు ఏ మాత్రం టెన్షన్ పెట్టవు, భయపెట్టవు. ఆ స్థాయిలో ఈ సన్నివేశాలను డిజైన్ చేయలేదు. ఊపిరి బిగబట్టి చూడాల్సిన సన్నివేశాలు తెరపై జరిగిపోతూ ఉంటాయి. ఇక పోలీసుల వైపు నుంచి కూడా పెద్దగా హడావిడి కనిపించదు. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగడం లేదని ప్రేక్షకులు ఫీలవుతుంటే, హీరోయిన్ ప్రేమ, పెళ్లి అంటూ వెంటపడటం వంటి సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి.
ఈ కథలోని అత్యంత కీలకమైన అంశం, సైకో లక్ష్యంగా చేసుకున్న వారి జాబితాను తెలుసుకోవడం, వారిని కాపాడటం. అయితే అందుకు సంబంధించిన సంఘటనలు కూడా తెరపై నెమ్మదిగానే నడిచాయి. ఈ తరహా కథలు నవల చదువుతున్నట్లుగా కాకుండా, స్పాట్‌లో మనం ఉండి చూస్తున్నట్లుగా అనిపించాలి. లేదంటే కొంత నిరాశ, మరికొంత అసంతృప్తి తప్పదు. ఈ సినిమా విషయంలోనూ అదే అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు, సాంకేతిక వర్గం
పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేయడంలో నవీన్ చంద్ర ఆరితేరాడనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయన యాక్షన్ ఆకట్టుకుంటుంది. నవీన్ చంద్రపై మనసు పారేసుకున్న యువతి పాత్ర కోసం, కాస్త గ్లామర్ లుక్ ఉన్నవారిని ఎంపిక చేస్తే బాగుండేదేమో. అలాగే ఆడుకాలం నరేన్ పాత్రకి కాస్త పవర్ యాడ్ చేయాల్సింది. దర్శకుడు లోకేశ్ అజిల్స్ కథలో మలుపులకు ప్రాధాన్యతను ఇవ్వడం బాగానే ఉంది. కానీ ఆ మలుపులు ప్రేక్షకులను టెన్షన్ పెట్టేలా డిజైన్ చేసుకుని ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లేది. కార్తీక్ అశోకన్ ఫొటోగ్రఫీ, ఇమాన్ నేపథ్య సంగీతం ఫర్వాలేదు. శ్రీకాంత్ ఎడిటింగ్ విషయానికి వస్తే, స్కూల్ ఎపిసోడ్ నిడివి తగ్గిస్తే బాగుండేదని అనిపిస్తుంది.
ముగింపు
దర్శకుడు ఎంచుకున్న కథాంశం ఆసక్తికరంగానే ఉంది. మలుపులు కూడా ఆసక్తికరంగానే అనిపిస్తాయి. అయితే ఆయా పాత్రలను డిజైన్ చేసిన తీరు, ఆయా సన్నివేశాల ట్రీట్‌మెంట్ విషయంలోనూ, వినోదపరమైన అంశాలను జోడించే విధానంలోనూ ఇంకాస్త కసరత్తు జరిగి ఉంటే, మరింత మెరుగైన అవుట్‌పుట్ వచ్చేదేమో అనిపిస్తుంది. ఓవరాల్‌గా, థ్రిల్లర్ ప్రియులు ఒకసారి ప్రయత్నించదగ్గ సినిమా ‘లెవన్’.
Read also: Kannappa: వాయిదా పడ్డ ‘కన్నప్ప’ నార్త్ ప్రీరిలీజ్ ఈవెంట్