‘గేమ్ ఛేంజర్’లో చిన్న పాత్ర చేసిన ప్రియదర్శి ప్రముఖ నటుడు ప్రియదర్శి రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటించే అవకాశంపై స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించడానికి ప్రధాన కారణం శంకర్ దర్శకత్వంలో పనిచేయాలనే తన కోరికేనని ఆయన వెల్లడించారు. తాను నటించే పాత్ర నిడివి గురించి ముందుగానే తెలుసని కూడా స్పష్టంచేశారు. నాని నిర్మాతగా రామ్ జగదీశ్ దర్శకత్వంలో రూపొందిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియదర్శి, ఈ విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శితో పాటు శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.’గేమ్ ఛేంజర్’లో తన పాత్ర గురించి ప్రియదర్శి మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం ఒప్పుకోవడం ‘బలగం’ కంటే ముందే జరిగింది.

అప్పటికి నేను హీరో స్నేహితుడి పాత్రలు ఎక్కువగా చేస్తున్నాను. ఈ సినిమాలో చాలా సన్నివేశాల్లో నటించాను. కానీ, ఎడిటింగ్ సమయంలో కొన్ని తొలగించబడ్డాయి” అని చెప్పారు. తన పాత్ర పరిమితమే అయినప్పటికీ, శంకర్, రామ్ చరణ్, తిరుగారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని, దాదాపు 25 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, చివరికి స్క్రీన్ టైమ్ రెండు నిమిషాలకు పరిమితమైందని తెలిపారు. అయినప్పటికీ, శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కడం తనకు సంతృప్తినిచ్చిందని చెప్పారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయాలనే తన చిరకాల కోరిక గురించి ప్రియదర్శి వెల్లడించారు.
గతంలో ‘ఆచార్య’ సినిమాలో ఒక పాత్ర కోసం ఒప్పుకున్నప్పటికీ, ఆ పాత్ర చివరికి తొలగించబడ్డట్లు తెలిపారు. అంతేకాకుండా బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోళా శంకర్’ చిత్రాల్లో నటించే అవకాశం కోసం ప్రయత్నించానని, కానీ అవి సాధ్యపడలేదని అన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. ప్రియదర్శి సినీ కెరీర్‌లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. చిన్న పాత్రల్లోనూ నటనతో మెప్పిస్తూ, మెరుగైన అవకాశాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ‘గేమ్ ఛేంజర్’లో అతని పాత్ర ఎంత మేర ప్రభావం చూపిస్తుందో చూడాలి.