తెలుగు సినిమా రంగంలో అపూర్వమైన ప్రతిభ కలిగిన నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) గారు ఇక లేరు. 83 ఏళ్ల వయసులో, హైదరాబాద్‌లో తన నివాసంలో 2025 జూలై 13 తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణవార్తతో తెలుగు సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం అలముకుంది.

సినీ ప్రయాణం – 750కి పైగా సినిమాల్లో నటన
కోటా శ్రీనివాసరావు గారు విలక్షణమైన నటనతో తెలుగు, తమిళ, హిందీ సహా పలు భారతీయ భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు. కోట శ్రీనివాసరావుకు భార్య రుక్మిణి, కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
పుట్టినిల్లు – నాటక రంగం నుంచే అరంగేట్రం
కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్ననాటి నుంచే నాటక రంగంతో సంబంధం ఉన్న ఆయన, 1978లో “ప్రాణం ఖరీదు” (The cost of life) సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. విలన్ పాత్రలు, హాస్య పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆహనా పెళ్లంట, గణేష్, ప్రతిఘటన సహా పలు సినిమాల్లో ఆయన సినిమా కెరీర్లో మైలురాళ్లు. సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పని చేశారు.
ఇతర భాషల సినిమాల్లో
తమిళం: 2003లో ‘సామి’ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి ప్రవేశించి, అక్కడ కూడా మంచి గుర్తింపు పొందారు. 2018లో వచ్చిన ‘కాత్తాడి’ ఆయన చివరి తమిళ చిత్రం.
హిందీ: 1987లో ‘ప్రతిఘాత్’ ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. 2016లో వచ్చిన ‘భాగీ’ ఆయన చివరి హిందీ సినిమా. రామ్ గోపాల్ వర్మ తీసిన సర్కార్ సినిమాలో కోట నటనకు బాలీవుడ్ ఫిదా అయ్యింది.
కన్నడ: 1997లో ‘లేడీ కమిషనర్’ ద్వారా కన్నడ చిత్రాల్లోకి అడుగుపెట్టారు. 2023లో విడుదలైన ‘కబ్బా’ ఆయన చివరి కన్నడ చిత్రం.
తెలుగులో చివరిగా ఆయన తెలుగులో ‘సువర్ణ సుందరి’ సినిమాలో కనిపించారు.
గౌరవాలు
కోట శ్రీనివాసరావు నట జీవితంలో ఆయన్ను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. 2015లో భారత ప్రభుత్వం ఆయన్ను ‘పద్మశ్రీ’తో గౌరవించింది. అలాగే, దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9’నంది’ అవార్డులు అందుకున్నారు.
రాజకీయ రంగప్రవేశం
కోట శ్రీనివాసరావు నటనతో పాటు రాజకీయాల్లోనూ కొంతకాలం రాణించారు. క్రియాశీలక పాత్ర పోషించారు. 1990లలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సినిమాల్లో తనకు మంచి జోడీగా పేరున్న బాబూమోహన్ కూడా అదే సమయంలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బాబూమోహన్ మంత్రి అయ్యే వరకు ఇద్దరూ అసెంబ్లీలో ఒకే దగ్గర కూర్చునేవారు
కోట గారి మృతి – సినీ లోకానికి అపూర్వ లోటు
కోటా శ్రీనివాసరావు గారి వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ, పాత్రలలో లీనమయ్యే శైలి – ఇవన్నీ ఆయన్ను అజరామర నటులుగా నిలిపాయి. ఆయన పాత్రలు సినిమాల్లో కాదు, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి .
కోటా శ్రీనివాసరావు తొలి సినిమా పేరు ఏమిటి?
ఆయన తొలి సినిమా ప్రాణం ఖరీదు (1978).
ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు?
1999లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Kannappa: ‘కన్నప్ప’ సినిమా ట్రోలింగ్స్ పై స్పందించిన మోహన్ బాబు