నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం(Akhanda 2 Day 1 Collections)’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ అయిన అఖండ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ సీక్వెల్‌ను రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంటలు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించారు.
భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించగా, సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్‌గా తమ్మిరాజు పనిచేశారు. యాక్షన్ సన్నివేశాలకు రామ్–లక్ష్మణ్ కొరియోగ్రఫీ అందించారు. కోటి పర్చూరి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆర్థిక అంశాలన్నీ పరిష్కరించుకున్న తర్వాత డిసెంబర్ 12న సినిమా థియేటర్లలో విడుదల కాగా, డిసెంబర్ 11న ప్రీమియర్లతో బాక్సాఫీస్ ప్రయాణం మొదలైంది.

మొదటి భాగం ఘన విజయం సాధించడంతో అఖండ 2ను ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా విస్తృతంగా వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ ఉపయోగించారు. స్టార్ క్యాస్ట్, టాప్ టెక్నీషియన్లు, భారీ ప్రొడక్షన్ విలువలతో ఈ సినిమా సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విడుదలకు ముందే ఈ చిత్రానికి దాదాపు 145 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్(Pre-release business) జరిగినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ డిమాండ్ కనిపించింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఉత్తరాంధ్ర హక్కులు సుమారు 13.5 కోట్లకు, గుంటూరు జిల్లా రైట్స్ 9.5 కోట్లకు, తూర్పు గోదావరి 8.25 కోట్లకు, పశ్చిమ గోదావరి 6.5 కోట్లకు, కృష్ణా జిల్లా 7 కోట్లకు, నెల్లూరు జిల్లా 4.5 కోట్లకు అమ్ముడయ్యాయి. సీడెడ్ ప్రాంతంలో ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు 26 కోట్లకు పూర్తైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

విదేశీ వసూళ్ల విషయానికి వస్తే, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ చిత్రం మోస్తరు ఆరంభాన్ని నమోదు చేసింది. ప్రీమియర్ల ద్వారా దాదాపు 4.15 లక్షల డాలర్లు వసూలు చేయగా, ఇది భారత కరెన్సీలో సుమారు 4.5 కోట్లకు సమానం. తొలి రోజు అక్కడ సుమారు 60 వేల డాలర్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా. మొత్తం మీద అమెరికాలో ప్రీమియర్లు(Premiers), తొలి రోజు కలిపి 5 నుంచి 6 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి మరో 2 కోట్ల వరకు రావచ్చని అంచనా.
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లకు మిశ్రమ స్పందన లభించింది. టికెట్ ధరల పెంపు ప్రభావం వసూళ్లపై కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రా, నైజాం కలిపి ప్రీమియర్లకు సుమారు 8.5 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. తొలి రోజు కలెక్షన్లు దాదాపు 10 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. దీంతో మొదటి రోజు మొత్తం వసూళ్లు 18.5 నుంచి 20 కోట్ల మధ్య ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :