బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) మరియు ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ వ్యాపారి నుంచి రూ. 60.4 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై, ముంబై పోలీసులు (Mumbai Police) వీరిద్దరిపై కేసు నమోదు చేశారు.ఈ వ్యవహారంపై ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. మోసానికి సంబంధించి భారీ మొత్తమే ఉండటంతో, ఈ కేసు ఇప్పుడు వేడి పుట్టిస్తోంది.దీపక్ కొఠారీ, ముంబైకి చెందిన వ్యాపారి, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్. ఆయన ఫిర్యాదు ప్రకారం, శిల్పా శెట్టి దంపతులు 2015 నుండి 2023 వరకు తనను మోసగించారు.వీరు వ్యాపార విస్తరణ పేరుతో డబ్బులు తీసుకున్నట్టు తెలిపారు. కానీ, ఆ మొత్తం తమ వ్యక్తిగత అవసరాలకే వాడారని దీపక్ ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం రూ. 60 కోట్లకు పైగా ఉంది.

శిల్పా-రాజ్ పరిచయం ఎలా జరిగిందంటే…
ఈ వ్యవహారంలో మూడవ వ్యక్తిగా ఉన్న రాజేశ్ ఆర్య ద్వారా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాతో తనకు పరిచయం ఏర్పడిందని దీపక్ వెల్లడించారు. అప్పటికి వారు ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు.తొలుత రూ. 75 కోట్లు రుణంగా కావాలని శిల్పా దంపతులు కోరారని దీపక్ చెప్పారు. కానీ, పన్ను భారం తప్పించుకునేందుకు దాన్ని పెట్టుబడిగా మార్చమని ఒత్తిడి చేసినట్టు వివరించారు.వీరిపై నమ్మకంతో, 2015లోనే రూ. 31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్‌లో రూ. 28.53 కోట్లు బదిలీ చేశానని దీపక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే మొత్తం 60.4 కోట్లకు పైగా వారి ఖాతాలోకి వెళ్లింది.
శిల్పా గ్యారెంటీ ఇచ్చినా, తర్వాత తప్పుకున్నారా?
2016లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినప్పటికీ, అదే ఏడాది సెప్టెంబర్‌లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. తర్వాతి సంవత్సరంలో మరో ఒప్పందం విఫలమై, కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లిందని దీపక్ వాపోయారు.ఈ మొత్తం మోసం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి EOWకి బదిలీ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది, ఇంకా అఫీషియల్ విచారణ మిగిలే ఉంది.శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా చుట్టూ గతంలోనూ వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఆరోపణలు రావడంతో బాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఈ కేసు ఎలా మలుపుతీసుకుంటుందో చూడాలి.
Read Also :