తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి (Chiranjeevi), 2008లో ఓ సరికొత్త మలుపు తీసుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి, “ప్రజారాజ్యం” పార్టీని స్థాపించారు. ప్రజల్లో ఆయనకి ఉన్న క్రేజ్ కారణంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరు బరిలోకి దిగారు. అయితే ప్రజల అంచనాలకు భిన్నంగా, ఈ పార్టీ కేవలం 18 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. చిరంజీవి రాజకీయ ఎంట్రీ పెద్ద ఊపు తీసుకురావడం కాకపోయినా, రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని చెప్పాలి.

కాంగ్రెస్ విజయం వెనుక గల గాథ
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 156 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) అమలు చేసిన సంక్షేమ పథకాలు – ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, పింఛన్లు – ఈ విజయానికి బలమైన పునాది అయ్యాయి. టీడీపీ మాత్రం 92 స్థానాలకు పరిమితమైంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్లే కాంగ్రెస్ గెలుపు సులభమైందట.2004లో కూటమిగా గెలిచిన కాంగ్రెస్, 2009లో ఒంటరిగా బరిలోకి దిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విజయవంతమైంది. అయినప్పటికీ, వైఎస్సార్ మాత్రం పూర్తిగా సంతృప్తిగా లేరు. గత ఎన్నికల కంటే తక్కువ ఓట్లు రావడమే ఆయనను నిరాశకు గురి చేసింది. దీంతో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవాలని భావించి “రచ్చబండ” అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు.
తీరని విషాదం – రచ్చబండకు వెళ్లినదారి చివరగా
2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ చిత్తూరు జిల్లాలో రచ్చబండ ప్రారంభించేందుకు బయలుదేరారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్, నల్లమల అడవుల్లో వాతావరణ ప్రభావంతో కూలిపోయింది. ఈ విషాద ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.వైఎస్సార్ మరణానంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని 2011లో భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ విలీనానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చింది. 2012లో ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. 2014 తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. అయితే, రాజకీయాల నుంచి పూర్తిగా దూరం కాలేదని ఆయన పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారని కూడా తెలిపారు.
Read Also :