తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ ఇకలేరు (Robo Shankar is no more). అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన, చివరకు సెప్టెంబర్ 18న తుదిశ్వాస విడిచారు.చెన్నైలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు రోబో శంకర్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. వెంటనే చిత్రబృందం అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అక్కడ కొన్ని రోజులపాటు చికిత్స పొందినా పరిస్థితి విషమించింది. చివరికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. వయసు కేవలం 46 ఏళ్లు మాత్రమే కావడం సినీప్రేమికులను మరింత కలిచివేసింది.

వ్యాధి నుండి కోలుకుని తిరిగి తెరపైకి
గత కొంతకాలంగా శంకర్ కామెర్ల సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుని కోలుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. తాజాగా కూడా ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఆకస్మిక అనారోగ్యం ఆయనను దూరం చేసింది.‘హే’, ‘దీపావళి’ సినిమాలతో రోబో శంకర్ తన సినీప్రస్థానం మొదలుపెట్టారు. ప్రత్యేకంగా ధనుష్ నటించిన ‘మారి’ చిత్రంలో ఆయన నటన విపరీతమైన ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అజిత్ హీరోగా వచ్చిన ‘విశ్వాసం’, శివకార్తికేయన్ నటించిన ‘వెలైక్కారన్’ వంటి చిత్రాల్లో తనదైన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు.తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రోబో శంకర్, కొద్దికాలంలోనే తమిళ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
కమల్ హాసన్ ఎమోషనల్ నివాళి
రోబో శంకర్ మరణంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళి అర్పిస్తూ హృదయానికి హత్తుకునే మాటలు రాశారు. “రోబో శంకర్ అనేది కేవలం పేరు మాత్రమే. నా దృష్టిలో నువ్వు నా తమ్ముడు. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతావు? నీ ప్రయాణం ముగిసింది, కానీ నా పని ఇంకా పూర్తికాలేదు. రేపు మనకోసం నువ్వు వెళ్లిపోయావు, కాబట్టి రేపు మనదే” అంటూ ఆయన ఎమోషనల్‌గా పేర్కొన్నారు.
అంత్యక్రియల వివరాలు
ప్రస్తుతం రోబో శంకర్ మృతదేహాన్ని చెన్నైలోని వలసరవక్కంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరుకానున్నారు.తన చలాకీతనం, నవరసాలను ఆడిపాడే నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న రోబో శంకర్ ఆకస్మిక మరణం తమిళ పరిశ్రమకు తిరుగులేని లోటు. ఆయనను అభిమానులు సోషల్ మీడియాలో కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.
Read Also :