ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయం బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి, అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు అల్లు అర్జున్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని రామ్ గోపాల్ పేట్ పోలీసులకు ముందుగానే తెలియజేశారు. అల్లు అర్జున్ ఆసుపత్రికి వెళ్లే అంశంపై ఇప్పటికే రామ్ గోపాల్ పేట్ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ దురదృష్టవశాత్తు మరణించారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పట్ల అల్లు అర్జున్ తీవ్ర విచారం వ్యక్తం చేసి, రేవతి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, “పుష్ప 2” మేకర్స్ రూ.50 లక్షలు, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చగా, అల్లు అర్జున్ ను ఏ11గా పేర్కొన్నారు. బన్నీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులపై హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తరువాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఈరోజు కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి, శ్రీతేజ్ కుటుంబంతో మాట్లాడి బాలుడి ఆరోగ్యంపై వివరాలు తెలుసుకుంటారని బన్నీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్శనకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు.ఇలాంటి ఘటనలపై స్పందిస్తూ బాధితులను పరామర్శించడం అల్లు అర్జున్ వ్యక్తిత్వానికి నిదర్శనం. తమ అభిమాన హీరో ఇలా ముందుకు రావడం, బాధితులకు సాయం చేయడం చూస్తూ అభిమానులు ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు.