జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓయూ జేఏసీ విద్యార్థి సంఘం సభ్యులు ఆయన నివాసం వద్ద నిరసనకు దిగారు. ఈ ఆందోళనకు కారణం,పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం.ఈ ఘటనకు అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు.ఆందోళనకారులు రేవతి కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటి ప్రాంగణంలోకి చొరబడి పూలకుండీలు పగలగొట్టడం, కాంపౌండ్ వాల్ ఎక్కి నినాదాలు చేయడం జరిగింది.సెక్యూరిటీ సిబ్బందితో నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులను అక్కడి నుంచి తరిమి వేశారు.ఈ ఘటనల నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఇదే సమయంలో,పుష్ప 2 ప్రీమియర్ కారణంగా జరిగిన సంఘటనలపై మాట్లాడిన అల్లు అర్జున్ అభిమానులకు కీలక సూచనలు చేశారు.
ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.ఎవరినీ కించపరిచేలా ప్రవర్తించకూడదు.అలాగే, నెగెటివ్ పోస్టులు పెట్టేవారికి దూరంగా ఉండండి, అని సూచించారు.ఫేక్ ప్రొఫైల్స్‌తో అనవసర పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన ఈ సందర్బంగా ఫ్యాన్స్‌ను మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా కోరారు. సినిమా వేడుకలు హర్షాతిరేకంతో జరగాలి కానీ, బాధాకర సంఘటనలు జరిగేలా కాకూడదు” అంటూ అభిమానుల దృష్టిని ఆకర్షించారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ ఎదుట విద్యార్థి సంఘాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలు పట్ల ఆయన స్పందన చూపిస్తూ బాధ్యతాయుతమైన ప్రవర్తనకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యలపై మరింత స్పష్టత రానుంది.