ఇప్పటి కాలంలో పాటకు 100 మిలియన్ వ్యూస్ రావడమే పెద్ద పండగ లాంటిదిగా భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని పాటలు యూ ట్యూబ్‌లో ఏకంగా 500 మిలియన్ వ్యూస్ దాటడమే కాక, 1000 మిలియన్ (1 బిలియన్) వైపు దూసుకెళ్తుండటం విశేషం. ఈ చరిత్ర సృష్టించిన పాటలు మన తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచే రావడం గర్వకారణం. మరి ఈ అత్యద్భుత విజయాలను సాధించిన పాటలేంటో తెలుసుకుందాం.ఇంతకుముందు వందల మిలియన్ల వ్యూస్‌ను కేవలం హిందీ లేదా ఇంగ్లీష్ పాటలకే సాధ్యం అనుకునేవారు. కానీ ఇప్పుడు మన తెలుగు పాటలు కూడా ఆ రేంజ్‌లో రాణిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల “గుంటూరు కారం” సినిమాకి చెందిన “కుర్చీ మడతబెట్టి” పాట యూ ట్యూబ్‌లో 500 మిలియన్ వ్యూస్‌ను దాటింది. ఈ గీతం, విడుదలైన కేవలం 9 నెలల్లోనే ఈ ఫీట్ సాధించి, తెలుగు పాటల క్రేజ్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్లింది.ప్రస్తుతం 500 మిలియన్ వ్యూస్ దాటిన తెలుగు పాటలు రెండు మాత్రమే ఉన్నాయి. వీటిలో రెండూ కూడా అల్లు అర్జున్ నటించిన చిత్రాలకు చెందినవే.897 మిలియన్ వ్యూస్‌తో బుట్టబొమ్మ(అల వైకుంఠపురములో) పాట యూ ట్యూబ్‌లో టాప్ పొజిషన్‌లో ఉంది.706 మిలియన్ వ్యూస్‌తో రాములో రాములా (అల వైకుంఠపురములో)రెండో స్థానంలో ఉంది.ఇప్పుడు “కుర్చీ మడతబెట్టి” 500 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది తెలుగు పాటల గ్లోబల్ రేంజ్‌ను మరింతగా ఇనుమడింపజేస్తోంది.తెలుగు పాటలతోపాటు తమిళ పాటలు కూడా అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తున్నాయి. ధనుష్ మరియు సాయి పల్లవి నటించిన “రౌడీ బేబీ” పాట ఏకంగా 1.6 బిలియన్ (1600 మిలియన్) వ్యూస్‌ను సాధించింది.
అదే విధంగా, “అరబిక్ కుత్తు” వీడియోకు 662 మిలియన్ వ్యూస్ వస్తే, లిరికల్ వెర్షన్‌కే 527 మిలియన్ వ్యూస్ వచ్చాయి. “మాస్టర్” సినిమా నుంచి వచ్చిన “వాతి కమింగ్” పాట కూడా 521 మిలియన్ వ్యూస్‌తో ప్రభావం చూపింది.తెలుగు పాటలు మాత్రమే కాక, దక్షిణాది సంగీతం మొత్తంగా యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటల విశేషమైన విజయాలు మన సినిమాలకు గ్లోబల్ గుర్తింపును తీసుకొస్తున్నాయి. “బుట్టబొమ్మ” నుంచి “కుర్చీ మడతబెట్టి” వరకు, ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతుందని ఆశిద్దాం!