China: చమురు అంశంపై రష్యా, చైనా మధ్య దూరం పెరుగుతుంది. ఈ నెలలో రెండు సంస్థలు పూర్తిగా ఆయిల్ కొనుగోలు నిలిపివేయగా, మరో రెండు సంస్థలు ఆ పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో రష్యా చమురు ఉత్పత్తిదార్లు, ట్యాంకర్లపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలయ్యాక, పుతిన్ ప్రభుత్వానికి చైనా, భారత్ అతిపెద్ద చమురు కొనుగోలుదారులుగా మారిన విషయం తెలిసిందే.

రష్యా వాటా కాస్త తగ్గి 30.5 శాతానికి
అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతుందన్న ఆందోళనల మధ్య భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. దీంతో గత నెలలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు ముడిచమురు దిగుమతులు పెరిగాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రష్యా నుంచి మన చమురు కొనుగోళ్లు జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో 3% తగ్గి రోజుకు 1.54 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ)కు పరిమితమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. మన మొత్తం చమురు దిగుమతుల్లో లాటిన్ అమెరికా వాటా 9 శాతానికి చేరింది. 2021 డిసెంబరు తర్వాత ఇదే అత్యధికం. రష్యా వాటా కాస్త తగ్గి 30.5 శాతానికి చేరింది.
కాల్పుల విరమణ దిశగా అడుగులు
ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు కోసం శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ చర్చల ఫలితంగా ఆంక్షలు సడలించడం, తొలగించడం కానీ జరిగితే మళ్లీ కొనుగోళ్లు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. టెహ్రాన్ (ఇరాన్ రాజధాని) న్యూక్లియర్ కార్యక్రమంపై చర్చలు తిరిగి ప్రారంభం కావాలని చైనా ఆకాంక్షిస్తోంది. ఈక్రమంలో చర్చల నిమిత్తం రష్యా, ఇరాన్ దౌత్యవేత్తలకు చైనా ఆతిథ్యం ఇచ్చింది. అణు ఒప్పందంపై ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.