China tariff : అమెరికా విధించిన 145 శాతం సుంకాలకు దీటుగా చైనా ప్రతిస్పందించింది. అమెరికా సరకులపై సుంకాలను ప్రస్తుత 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. శనివారం నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. అయితే, సుంకాల విషయంలో ప్రతీకార ధోరణి తగదని, చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమేనని తెలిపింది. అదేసమయంలో….ట్రంప్ తమ దేశంపై మరింతగా టారిఫ్‌ల భారంమోపినా పట్టించుకోబోమని పేర్కొంది. ఈ స్థాయిని మించి సుంకాలను పెంచడం ఆర్థికపరంగా తెలివైన నిర్ణయం కాబోదని అభిప్రాయపడింది.

బీజింగ్ ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే గట్టిగా ఎదుర్కొంటాం
ఇదేతీరును కొనసాగిస్తే… ప్రపంచ వాణిజ్య చరిత్రలో పరిహాసాస్పదంగా మిగిలిపోవడం ఖాయమని హెచ్చరించింది. బీజింగ్ ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే గట్టిగా ఎదుర్కొంటామని విస్పష్టం చేసింది. వాషింగ్టన్ సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లోని వివాద పరిష్కార యంత్రాంగం వద్ద ఇప్పటికే వ్యాజ్యం దాఖలు చేసినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా చిత్తశుద్ధితో భావిస్తే..బాధ్యతారాహిత్య చర్యలను, ఒత్తిడిని పెంచే ఎత్తుగడలను విరమించుకోవాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ సూచించారు.
145 శాతం సుంకాలు బెదిరింపు చర్య
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల మోత మోగిస్తున్న నేపథ్యంలో…ఆ అంశంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారి అధికారికంగా స్పందించారు. తమ దేశంపై అమెరికా విధించిన 145 శాతం సుంకాలను బెదిరింపు చర్యగా జిన్‌పింగ్ అభివర్ణించారు. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను ప్రతిఘటించడానికి ఐరోపా సమాజం(ఈయూ) తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు.
Read Also: పసిఫిక్ దేశంలో భూకంపం